YSRCP News: రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న అధికార వైసీపీ అందుకు అనేక ప్రయత్నాలను చేస్తోంది. ఇప్పటికే అనేక చోట్ల అభ్యర్థులను మారుస్తుండగా, మరికొన్ని చోట్ల అభ్యర్థులకు స్థాన చలనం కలిగిస్తున్నారు. తాజాగా మరో ఆసక్తికరమైన నిర్ణయం దిశగా వైసీపీ అడుగులు వేస్తోంది. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్‌ కుమార్‌ యాదవ్‌ను వచ్చే ఎన్నికల్లో నరసారావుపేట్ల పార్లమెంట్‌ స్థానం నుంచి బరిలోకి దించేందుకు వైసీపీ సిద్ధమవుతోంది.


ఇక్కడ సిటింగ్‌ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు కొద్దిరోజులు కిందటే వైసీపీకి, ఎంపీ స్థానానికి రాజీనామా చేశారు. ముందు నుంచీ ఈ స్థానంపై వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్‌ చేసింది. ఈ పార్లమెంట్‌ స్థానాన్ని తప్పక గెలవాలని భావిస్తున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిటింగ్‌ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు ఎంపీ స్థానానికి బదిలీ చేయాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. ఇందుకు ఎంపీ అంగీకరించకపోవడంతో కొద్దిరోజులపాటు ఈ స్థానంపై తర్జనబర్జన కొనసాగింది. అనూహ్యంగా శ్రీకృష్ణదేవరాయలు పార్టీకి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేయడంపై వైసీపీ దృష్టి సారించింది.


నాగార్జున యాదవ్ పేరు పరిశీలనలోకి


ముందుగా నాగార్జున యాదవ్‌కు ఈ స్థానాన్ని కేటాయించాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి భావించినట్టు ప్రచారం జరిగింది. కానీ, ఈ పార్లమెంట్‌ స్థానం పరిధిలో ఎక్కువ మంది బీసీ ఓటర్లు ఉండడంతో.. అదే సామాజికవర్గానికి చెందిన ప్రముఖ వ్యక్తిని బరిలోకి దించడం ద్వారా అసెంబ్లీ స్థానాలపై పట్టు సాధించవచ్చని సీఎం భావించారు. ఇందుకు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సరైన వ్యక్తిగా భావించిన వైసీపీ అధిష్టానం ఈ మేరకు నిర్ణయాన్ని మాజీ మంత్రి చెవిలో వేసింది. అధిష్టానం నిర్ణయమే తన నిర్ణయమని చెబుతూ ఉండే అనీల్‌ కుమార్‌ యాదవ్‌ పార్లమెంట్‌కు వెళ్లేందుకు సిద్ధమైనట్టు చెబుతున్నారు. ఈ మేరకు అనుచరులతో సమాలోచనలను కూడా మంత్రి చేశారని చెబుతున్నారు. 


ఎమ్మెల్యే అభ్యర్థుల కోరిక మేరకు


నరసారావు పేట పార్లమెంట్‌ స్థానం పధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులంతా ఇక్కడి నుంచి బలమైన అభ్యర్థిని పార్లమెంట్‌కు పోటీ చేయించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పేరును ప్రతిపాదించగా, ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా సానుకూలంగా స్పందించడంతో వైసీపీ ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తోంది. పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో.. మూడు స్థానాలు నుంచి రెడ్డి, రెండు స్థానాలు నుంచి కమ్మ, మరో రెండు స్థానాలు నుంచి కాపు సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. అంటే, ఏడు అసెంబ్లీ స్థానాలు నుంచి ఓసీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులు బరిలోకి దిగుతుండడంతో.. పార్లమెంట్‌ స్థానం నుంచి బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని బరిలోకి దించడం సామాజిక సమతుల్యాన్ని పాటించినట్టు అవుతుందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. లావు శ్రీ కృష్ణదేవరాయలు వంటి బలమైన వ్యక్తి పార్టీ నుంచి వెళ్లిపోయిన నేపథ్యంలో అంతే బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని వైసీపీ లెక్కలు వేసింది. బీసీ సామాజికవర్గంలో బలమైన నేతగా పేరుగాంచిన అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అయితే ఆయా అసెంబ్లీ స్థానాలపై కూడా ప్రభావం ఉంటుందని వైసీపీ లెక్కలు వేసి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. 


అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సిద్ధం


సీఎం జగన్మోహన్‌రెడ్డి నిర్ణయం మేరకు నడుచుకుంటానని గతంలో అనేకమార్లు ప్రకటించిన అనిల్‌ కుమార్‌ యాదవ్‌.. తాజా నిర్ణయం పట్ల కూడా సానుకూలంగానే స్పందించినట్టు చెబుతున్నారు. నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసే ఉద్ధేశంలో ఆయన అందుకు అనుగుణంగానే పని చేసుకుంటున్నారు. తాజాగా అధిష్టానం ఎంపీగా వెళ్లమని ఆదేశిస్తుండడంతో ఆ దిశగా పయనించేందుకు సిద్ధపడుతున్నారు. పార్టీకి ఎక్కడకు వెళ్లమంటే అక్కడికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు అనిల్‌ కుమార్‌ సన్నిహితులు వద్ద చెబుతున్నారు. మంచి వాగ్ధాటి కలిగిన నాయకుడిగా వైసీపీలో అనిల్‌ కుమార్‌కు పేరుంది. నరసారావుపేటకు పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసినా.. అక్కడి ప్రజలు అక్కున చేర్చుకుంటారన్న నమ్మకాన్ని అనిల్‌ కుమార్‌ వ్యక్తం చేస్తున్నారు.


ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, జగన్‌ అన్న తనను విజయ తీరాల వైపు చేరుస్తారన్న నమ్మకాన్ని అనిల్‌ వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే, నెల్లూరు సిటీ సీటును మాత్రం తాను సూచించే వ్యక్తికి ఇవ్వాలని పట్టుబట్టే అవకాశముందన్న ప్రచారమూ జరుగుతోంది. అయితే, ఇప్పటి వరకు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ నోటి నుంచి అటువంటి మాటలు రాలేదు గానీ సన్నిహితులు మాత్రం ఈ మేరకు చెబుతున్నారు. చూడాలి మరి వైసీపీ అధిష్టానం ఎంపీగా అనిల్‌ కుమార్‌ పేరును ఖరారు చేసి.. నెల్లూరు సిటీకి మరో అభ్యర్థిని బరిలోకి దించుతుందా..? చివరి నిమిషంలో ఏమైనా మార్పులు చేస్తుందా.