కమ్మ వర్గానికి ఎపీ ముఖ్యమంత్రి జగన్ అన్యాయం చేస్తున్నారని, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తాను ఓడిపోయినప్పటికి ఆప్కాబ్ ఛైర్మన్ ఇచ్చారని,అదే విధంగా ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రులుగా బాధ్యతలు అప్పగించారని అన్నారు. పక్కనే ఉన్న తెలంగాణలో కమ్మ వారికి ప్రాధాన్యత లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణప్రసాద్ ప్రస్తుతం మైలవరం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు.


చర్చనీయాశంగా మారిన వసంత వ్యాఖ్యలు...


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ హోం మంత్రి, మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చినా కూడ కమ్మ కులస్తులు స్పందించలేదని అసహనం వ్యక్తం చేశారు. జగ్గయ్యపేటలో కాకతీయ సేవా సమితి నిర్వహించిన వన సమారాధనలో పాల్గొన్న వసంత నాగేశ్వరరావు తెలుగు రాష్ట్రాల్లో  రాజకీయాలపైన పలు వ్యాఖ్యలు చేశారు. 


ఏపీ కేబినెట్‌లో కమ్మ వర్గానికి చెందిన మంత్రి లేకపోవటం ఏంటని వసంత నాగేశ్వరరరావు నిలదీశారు. రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, వైఎస్సార్ పేర్లతో అనేకం ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. అయితే గతంలో ఏ ప్రభుత్వం వారి పేర్లను మార్చే ప్రయత్నం చేయలేదన్నారు. రాష్ట్రంలో కమ్మవర్గంపైన రాజకీయంగా దాడి చేస్తున్నా ఎవ్వరూ స్పందించటం లేదని, ఇందుకు కారణాలు ఏంటో కూడా అర్థం కావటం లేదని వ్యాఖ్యానించారు. 


ఇదే సమయంలో వసంత మరిన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. పలు నియోజకవర్గాల్లో అత్యధిక ఓటర్లు కలిగిన కమ్మ సామాజిక వర్గం ఇతర సామాజిక వర్గాల పల్లకీలు ఇంకెంత కాలం మోస్తారని ప్రశ్నించారు. ఇప్పుడున్న ఇలాంటి రాజకీయాలు సరైనవి కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పరిస్థితులు మారితేనే యువత రాజకీయాల్లోకి వస్తారని తెలిపారు. 


తెలంగాణాలో కమ్మ వారికి ప్రాధాన్యత 


తెలంగాణా రాష్ట్ర అసెంబ్లీలో కమ్మ సామాజిక వర్గానికి రాజకీయంగా ప్రాధాన్యత లభిస్తుందని, ఈ విషయం కాస్త సంతోషించ తగిన పరిణామమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌లో తెలంగాణ మంత్రులు ఉన్నారని ఏపీలో లేకపోవటం విచారకరమని వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కమ్మవారికి పూర్తి స్థాయిలో పట్టు ఉందని అయితే కేవలం రాజకీయాల కోణంలో చూసి, సామాజిక వర్గాల వారీగా విడదీసి, రాజకీయాలు చేయటం ప్రమాదకరమని వసంత వ్యాఖ్యానించారు. వసంత చేసిన వ్యాఖ్యలు ఇప్పడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారాయి.


మైలవరం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కుమారుడు...


వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణప్రసాద్ 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసి మాజీ మంత్రి దేవినేని ఉమాను ఓడించి వైసీపీ గుర్తుపై గెలుపొందారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాత సీఎం జగన్ తన తొలి కేబినెట్ లో కమ్మ వర్గానికి చెందిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి మంత్రిగా అవకాశం కల్పించారు. రెండో దఫా జరిగిన కేబినెట్ విస్తరణలో కొడాలి నానిని తప్పించారు. కమ్మ వర్గానికి కేబినెట్ లో స్దానం లభించలేదు. ఈ పరిణామం కమ్మ వర్గానికి మింగుడు పడటం లేదని కూడ ప్రచారం జరుగుతుంది..


మంత్రి పదవి ఆశించిన వసంత కృష్ణప్రసాద్ 
మైలవరం నుంచి దేవినేని ఉమా వంటి కరుడుకట్టిన టీడీపీ నేతపై గెలుపొందిన తరువాత వసంతకు వైసీపీలో ప్రాధాన్యత లభిస్తుందని అంతా ఆశించారు. వసంత అనుచరగణం కూడా పార్టీలో అగ్ర ప్రాధాన్యత లభిస్తుందని అంచనా వేసుకున్నారు. కాని మొదటి క్యాబినేట్‌లో వసంతకు మంత్రి పదవి దక్కకపోయినా, కొడాలి నానిని తప్పించిన తరువాత వసంత కృష్ణప్రసాద్‌కు ఆ స్దానం దక్కుతుందని భావించారు. కాని జగన్ ఈక్వేషన్‌లో అసలు సామాజిక వర్గాన్నే పూర్తిగా పక్కన పెట్టాల్సి వచ్చింది. దీంతో వసంత కృష్ణప్రసాద్ వర్గం డీలా పడినప్పటికి, పార్టీలోనే నమ్మకంగా కొనసాగుతున్నారు.