ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కోర్టును ఆశ్రయించారు. సీఐడీ తమపై నమోదు చేసిన రెండు కేసులను కొట్టివేయాలని కోరుతూ మాజీ మంత్రి నారాయణ, మరి కొందరు ఏపీ  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఇదే వ్యవహారంతో ముడిపడి ఉన్న మరో వ్యాజ్యాన్ని ప్రస్తుత కేసులతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. పిటిషనర్లపై తొందరపాటు చర్యలు వద్దన్న న్యాయస్థానం....గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల గడువును పొడిగించింది. 


రాజధాని అమరావతిలో అసైన్డ్‌ భూముల కొనుగోలు వ్యవహారంపై గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన యల్లమాటి ప్రసాద్‌ కుమార్‌ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా ఏపీ సీఐడీ 2020 ఫిబ్రవరి 27న పలువురిపై ఎస్సీ, ఎస్టీ  కేసుతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. మరోవైపు ఇదే వ్యవహారంపై నల్లూరు రవికిరణ్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2020 మార్చి 3న మరో కేసు నమోదు చేసింది. 2022లో నారాయణ పేరును నిందితుల జాబితాలో చేర్చింది. 


సీఐడీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ మాజీ మంత్రి నారాయణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టులో విచారణకురాగా.. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదించారు. ప్రస్తుత వ్యాజ్యాలతో ముడిపడిన మరో వ్యాజ్యం విచారణకు రాలేదన్నారు. దాన్ని కూడా కలిపి విచారించాలని న్యాయస్థానాన్ని కోరారు. అంగీకరించిన కోర్టు... ఇదే వ్యవహారంతో ముడిపడి ఉన్న మరో వ్యాజ్యాలను జత చేయాలని ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణను ఈనెల 25కి వాయిదా వేశారు.