Disaster Management Organization Warns: భానుడు రోజురోజూ తీవ్రరూపం దాల్చుతున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉదయం నుంచే భగభగమండుతున్నాడు. ఎండ తీవ్రతకు బయటకు వచ్చేందుకు కూడా ప్రజలు భయపడుతున్నారు. ఎండ వేడిమితోపాటు ఉక్కపోత కూడా వేధిస్తుండడంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తగిన సూచనలు, సలహాలను జారీ చేస్తోంది. తాజాగా విడడుదల చేసిన సూచనలు ప్రకారం.. రాష్ట్రంలోని 56 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు ఉంటాయని విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. మరో 174 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది. శనివారం మరో 64 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 170 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు.
జిల్లాలు వారీగా వడగాడ్పులు వీచే ప్రాంతాల సంఖ్య
శుక్రవవారం తీవ్ర వడగాడ్పులు వీచే మండలాలు 56 ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. జిల్లాలు వారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో 13 మండలాలు, విజయనగరం జిల్లాలో 23 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 13, అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు, అనకాపల్లి జిల్లాలో మూడు, తూర్పు గోదావరి జిల్లాలో ఒకటి, కాకినాడ జిల్లాలో మరో మండలంలో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశముందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అలాగే, వడగాడ్పులు వీచే అవకాశం 174 మండలాల్లో ఉన్నట్టు వెల్లడించింది. జిల్లాలు వారీగా ఆయా మండలాలను చూస్తే.. శ్రీకాకుళం జిల్లాలో 12, విజయనగరం జిల్లాలో నాలుగు, పార్వతీపురం మన్యం జిల్లాలో రెండు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో పది, విశాఖపట్నం జిల్లాలో మూడు, అనకాపల్లి జిల్లాలో 12, కాకినాడ జిల్లాలో 17, కోనసీమ జిల్లాలో తొమ్మిది, తూర్పు గోదావరి జిల్లాలో 18 మండలాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు మండలాలు, ఏలూరు జిల్లాలో 14 మండలాలు, కృష్ణా జిల్లాలో 11 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలో ఆరు మండలాలు, గుంటూరు జిల్లాలో 14 మండలాలు, పల్నాడు జిల్లాలో 18 మండలాలు, బాపట్ల జిల్లలో రెండు, ప్రకాశం జిల్లాలో ఎనిమిది మండలాలు, తిరుపతి నాలుగు మండలాలు, నెల్లూరు జిల్లాలోని ఒక మండలం, సత్యసాయి జిల్లాలోని ఐదు మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
నందవరంలో 45.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లాలో నందవరంలో 45.6 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజయనగరం జిల్లా రాజాంలో 45.5 డిగ్రీలు, అల్లూరి జిల్లా కొండెంగూడెంలో 45.1 డిగ్రీలు, వైఎస్‌ఆర్ జిల్లా ఖాజీపేటలో 44.7 డిగ్రీలు, కర్నూలు జిల్లా కోడుమూరులో 44.2 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలో 44.1 డిగ్రీలు, తూర్పు గోదావరి జిల్లా నందరాడ, పల్నాడు జిల్లా రావిపాడు, శ్రీకాకుళం జిల్లా కొల్లివలసలో 44 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 16 జిల్లాల్లో 43 డిగ్రీలకుపై ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 72 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 102 మండలాల్లో వడగాడ్పులు వీచాయి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. ఉదయం 11 గంటలు నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లో ఉండాలని సూచించింది. ఎండ దెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దస్తులు ఉపయోగించాలని సూచించింది. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవాళ్లు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు.