Dhulipalla Narendra on Sajjala Ramakrishna Reddy: ఏపీలో నకిలీ ఓట్ల వ్యవహారం హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం అధికార వైసీపీ లక్షల కొద్దీ దొంగ ఓట్లను చేర్చిందని టీడీపీ ఆరోపిస్తూ ఉంది. అయితే, టీడీపీ అధికారంలో ఉండగానే ఆ నకిలీ ఓట్లను చేర్చారని అధికార పార్టీ నేతలు వాదిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ చేసిన పోస్ట్ ఆసక్తిని కలిగించింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి దొంగ ఓట్లు ఉన్నాయని టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర ఎక్స్ లో పోస్ట్ చేశారు.


పైగా సజ్జలకు, ఆయన కుటుంబ సభ్యులకు ఉన్న ఓటర్ జాబితాలోని పేర్లను కూడా ధూళిపాళ్ల బయట పెట్టారు. పొన్నూరు నియోజకవర్గ పరిధిలో, మంగళగిరిలో కూడా సజ్జల కుటుంబంలోని అందరికీ ఓట్లు ఉన్నాయని ధూళిపాళ్ల ఆరోపించారు. సజ్జలను సలహాల రెడ్డి అని సంబోధిస్తూ.. మంగళగిరి ఒక ఓటు, పొన్నూరులో మరో ఓటు ఉందని ఎద్దేవా చేశారు. ‘‘క్యాంప్ ఆఫీస్ క్లర్క్.. రెడ్ హ్యాండెడ్ గా బుక్. రెండు చోట్ల దొంగ ఓట్లతో సలహాల రెడ్డి అడ్డంగా దొరికాడు! పొన్నూరులో ఒక ఓటు.. మంగళగిరిలో మరో ఓటు’’ అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. అయితే, దీనిపై అధికార పార్టీ నుంచి ఇంత వరకూ ఎలాంటి స్పందన లేదు.






వైసీపీ కౌంటర్ ఇదీ


ప్రజల్ని తప్పుదోవ పట్టించే తప్పుడు ప్రచారాలు చేయడంలో టీడీపీని మించినోళ్లు ఎవరూలేరని మరోసారి రుజువయ్యింది. పొన్నూరు, మంగళగిరి రెండూ పక్క పక్క నియోజకవర్గాలు, ప్రస్తుతం సజ్జల రామకృష్ణా రెడ్డి కుటుంబం నివాసం ఉంటున్న ఇల్లు రెండు నియోజకవర్గాల బోర్డర్ లో ఉన్న గ్రామాల పరిధిలోకి వస్తుంది. సాంకేతిక లోపం వల్ల ఓట‌ర్ల జాబితాలో వారి పేర్లు రెండు చోట్ల న‌మోదైన విష‌యం వారి దృష్టికి వ‌చ్చిన వెంట‌నే ఒక‌చోట తొల‌గింపున‌కు సంబంధించి చ‌ర్య‌లు తీసుకోమ‌ని జ‌న‌వ‌రి 31న అధికారుల‌ను కోరారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ప్ర‌క్రియ జ‌రుగుతోంది. అయితే ఈలోపే మీరు ఆరాటం ఆపుకోలేక దుష్ప్ర‌చారం చేస్తున్నారు. మీలాగా దొంగ ఓట్లు న‌మోదు చేసుకుని గెల‌వాల‌ని చూసే అల‌వాటు మాకు లేదు. మీ నాయకుడు చంద్రబాబు మాదిరి కుప్పంలో ప‌క్క రాష్ట్రానికి చెందిన 30 వేల మందికి ఓటుహ‌క్కు క‌ల్పించి, ఎమ్మెల్యేగా గెలిచే బాపతు మేము కాదులే’’ అంటూ వైసీపీ కౌంటర్ పోస్ట్ చేసింది.