175 సీట్లు గెలవాలని వైఎస్‌ఆర్‌సీపీ లీడర్లకు టార్గెట్ ఫిక్స్‌ చేసిన సీఎం జగన్... తాను కూడా పార్టీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇన్నాళ్లూ ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా ఇప్పుడు పార్టీకి కాస్త టైం కేటాయించాలని నిర్ణయించారు. ఇప్పటికే వివిధ జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించిన జగన్... ఇప్పుడు క్రియాశీల కార్యకర్తలతో సమావేశం కానున్నారు. 


సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం నుంచి కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ముందుగా కుప్పం నియోజకవర్గం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు. అక్కడ పార్టీ బలాబలాలు, ప్రజల్లో ఉన్న టాక్, పథకాల అమలు అన్నింటిపై వారితో మాట్లాడనున్నారు. 
 
సీఎం జగన్ ఇప్పటికే జిల్లాల వారీగా సమీక్షలు చేస్తూ వస్తున్నారు. అది కొనసాగిస్తూనే కార్యకర్తలతో కూడా మాటామంతి కార్యక్రమం స్టార్ట్ చేశారు. రోజుకో గంటసేపు కార్యకర్తల కోసం కేటాయించనున్నారు సీఎం. మొదటిరోజు కుప్పం  నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ కానున్నారు జగన్.


వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ తర్వాత పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టారు అధినేత జగన్. పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలే కీలకం అని జగన్ ఎన్నోసార్లు చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను నేరుగా కలవలేకపోయారు. దీంతో కార్యకర్తల్లో అసంతృప్తి ఉందనే ప్రచారం జరిగింది. పార్టీని ఆధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన శ్రేణులకు అధినేతను కలవడం కష్టమైంది. దీంతో చాలా చోట్ల గత ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలు ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉన్నట్లు జగన్‌ దృష్టికి వచ్చింది. 


కార్యకర్తలను అధినేత జగన్ పట్టించుకోవడం లేదన్న అపోహ తొలగించేందుకు ఇలా నేరుగా భేటీ కార్యక్రమం చేపట్టారు. ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉండటంతో కార్యకర్తలతో సమావేశం కావాలని నిర్ణయించారు. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు.  


గురువారం నుంచి ప్రతిరోజూ సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర వరకూ కార్యకర్తల కోసం సమయం కేటాయించారు జగన్. రోజూ 50 మందితో సీఎం భేటీ కానున్నారు. దీని కోసం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే ఎవరెవరిని కలవాలి... ఆ 50 మంది ఎవరు అనే బాధ్యతను స్థానిక నేతలకు అప్పగించారు. గతంలో పార్టీ కోసం కష్టపడి ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న వారిని గుర్తించారు. అలాంటివారి జాబితా పంపాలని సీఎం కార్యాలయం సూచింది.


ఒక్కొక్క కార్యకర్తతో నిమిషం నుంచి ఒకటిన్నర నిమిషం పాటు మాట్లాడనున్నారు సీఎం జగన్. వారితో మాట్లాడి స్థానిక పరిస్థితులపై ఆరా తీయనున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరితో ఫొటో దిగానున్నారు జగన్. దీని ద్వారా కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తి పోగొట్టడంతోపాటు వారిని వచ్చే ఎన్నికలకు సన్నద్ధం చేయనున్నారు. ఒకవైపు జిల్లాల సమీక్షలు, మరోవైపు కార్యకర్తలను కలవడం ద్వారా పార్టీని గెలుపు బాట పట్టించేలా ముందుకెళ్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.