రీ సర్వే చేస్తున్నప్పుడు వచ్చే సమస్యలను అత్యంత ప్రణాళికాబద్ధంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. ప్రజలను పూర్తి స్థాయిలో సంతృప్తిపరిచేలా, భూ సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారాలు చూపేలా రీసర్వే ఉండాలన్నారు సీఎం జగన్. వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. 


రీసర్వేలో నాణ్యత అనేది చాలా ముఖ్యమన్నారు సీఎం జగన్. ఒక గ్రామంలో రీసర్వే చేసిన తర్వాత అన్ని రకాలుగా ఈ ప్రక్రియను ముగించాలన్నారు. ఆ గ్రామంలో మనదైన ముద్ర కనిపించాలని, భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కారం కావాలి సూచించారు. రీసర్వే పేరుతో మహాయజ్ఞం చేస్తున్నామని, వాటి ఫలాలు ప్రజలకు అందాలని అభిప్రాయపడ్డారు. నాణ్యత అనేది కచ్చితంగా ఉండాలన్నారు. ఎక్కడా కూడా సర్వే అసంపూర్తిగా మిగిలిపోయిందన్న మాట రాకూడదని, మొబైల్‌ ట్రైబ్యునళ్లు, సరిహద్దులు, సబ్‌డివిజన్లు..  క్రమ పద్ధతిలో ముందుకు సాగాలని ఆదేశించారు. 


రీ సర్వే చేస్తున్నప్పుడు వచ్చే సమస్యలను అత్యంత ప్రణాళికాబద్ధంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని, ప్రజలను పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచేలా, భూ సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారాలు చూపేలా రీసర్వే ఉండాలన్నారు సీఎం జగన్.  అప్పుడే ఈ పెద్ద కార్యక్రమానికి సార్థకత లభిస్తుందని జగన్ అభిప్రాయపడ్డారు. ఈ సర్వే ద్వారా రెవెన్యూ వ్యవస్థ పూర్తి స్థాయిలో ప్రక్షాళన అవుతుందని, రికార్డులు, డేటా అంతా కూడా స్వచ్ఛీకరణ జరుగుతుందని వివరించారు. ఈ అంశాలను అధికారులు దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలన్నారు. 


రీ సర్వే ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే కారణంతో చాలా మంది ఈ కార్యక్రమంపై దుష్ఫ్రచారం చేస్తున్నారని, అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని జగన్ విమర్శించారు. తద్వారా ఈ గొప్ప ప్రయత్నాన్ని నీరుగార్చి, ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని సూచించారు. 100 ఏళ్ల తర్వాత సర్వే చేస్తున్నాం, దీని కోసం కొన్ని వేల మందిని రిక్రూట్‌ చేసుకున్నాం, అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేశామని, ఎవ్వరూ కూడా వేలెత్తి చూపని విధంగా సర్వే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని జగన్ అన్నారు. 


దోషాలతో, తప్పులతో ఒక్క హక్కు పత్రం కూడా రైతులకు వెళ్లకూడదని, సంబంధిత గ్రామ సచివాలయంలో సర్వే పూర్తికాగానే అక్కడ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం కూడా ఏర్పాటయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారు. సర్వే పూర్తైన తర్వాత ప్రతి గ్రామంలో 5శాతం రికార్డులను ఆర్డీఓలు, 1 శాతం జేసీలు హక్కు పత్రాలను వెరిఫికేషన్‌ చేయాలన్నారు. తప్పులు, పొరపాట్లు లేని విధంగా హక్కు పత్రాలు జారీ చేస్తామని అధికారులు తెలిపారు. భూ సర్వే ప్రక్రియలో ఏ దశలో అభ్యంతరాలు వ్యక్తమైనా వాటిని పరిష్కరించే వ్యవస్థలను బలోపేతం చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. 


ఈ సర్వే పూర్తి చేయడం ద్వారా భూ యజమానుల హక్కులను తరతరాలపాటు కాపాడుగలుగుతామని, ఆక్రమణలు, కబ్జాలు, రికార్డుల్లో అవకతవకలు ఇలాంటి వాటికి పూర్తి స్థాయిలో చెక్‌ పడుతుందన్న అధికారులు.. కేవలం 5 సెంటీమీటర్ల వ్యత్యాసంతో కచ్చితమైన పద్ధతుల్లో సర్వే జరుగుతుందన్న సీఎంకు తెలిపారు. భూయజమానులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, వారిని పూర్తి స్థాయిలో సంతృప్తపరిచే పద్ధతుల్లో సర్వే జరుగుతోందని వెల్లడించారు. ఇప్పటి వరకూ 6,037 గ్రామాల్లో డ్రోన్లను ఎగరవేశామని, ఇందులో 1,545 గ్రామాల్లో రెవెన్యూ రికార్డులు కూడా ఖరారయ్యాయని అధికారులు తెలిపారు.


ప్రతినెలా 13,335 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని లక్ష్యంగా చేసుకుని సర్వే చేస్తున్నామన్న అధికారులు వివరించారు. డ్రోన్లు ఎగురవేయడానికి అనువుగాలేని ప్రాంతాల్లో విమానాలు, హెలికాప్టర్ల ద్వారా సర్వే చేయడానికి అన్ని రకాలుగా సిద్ధమయ్యామన్న అధికారులు సీఎంకు వివరించారు. నవంబర్‌ మొదటి వారంలో తొలివిడత గ్రామాల్లో హక్కు పత్రాలను అందిస్తామని, ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి  ద్వారా ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.