వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 175 నియోజకవర్గాల్లో గెలవడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌కు అన్ని నియోజకవర్గాల్లో గెలిచే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. అసలు వారు 175 సీట్లలో పోటీ చేయగలరా అని సవాలు విసిరారు. తాము ప్రజలకు మంచి చేశాం కాబట్టే మళ్లీ గెలుస్తామన్న నమ్మకం ఉందని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో వరుసగా నాలుగో ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా నిధులను సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఈ ఏడాది మూడో విడతగా 51.12 లక్షల మందికి రూ.1,090.76 కోట్ల నిధులను విడుదల చేశారు. మంగళవారం (ఫిబ్రవరి 28) తెనాలి మార్కెట్ యార్డులో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడారు.


ప్రస్తుతం  రాష్ట్రంలో యుద్ధం జరుగుతోంది అన్నారు. ఆ యుద్ధంలో ప్రజలంతా సహకారం అందించాలని కోరారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే బడ్జెట్ కానీ.. ఎందుకు ప్రజలకు ఉపయోగకరమైన పథకాలు అందించలేదని ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేస్తూ ఉంటే కుట్రలు చేసేందుకు చంద్రబాబు, దత్తపుత్రుడు తోడుదొంగలుగా వస్తున్నారని అన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా తనకు సహకారంగా ఉండాలని కోరారు.



‘‘మన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి చంద్రబాబుకు కడుపుమంటగా ఉంది. కడుపు మంటకు, అసూయకు అసలే మందు లేదంటూ చంద్రబాబుకు హితవు పలికారు. రాష్ట్రంలో ఈరోజు యుద్ధం జరుగుతోంది. కరవుతో స్నేహం చేసిన చంద్రబాబుకు, మీ బిడ్డకు మధ్య వచ్చే ఎన్నికల్లో యుద్ధం జరగబోతోంది. ఇంగ్లీష్‌ మీడియం వద్దన్న చంద్రబాబుకు మీ బిడ్డకు యుద్ధం జరగబోతోంది. రాష్ట్రంలో గజ దొంగల ముఠా ఏర్పడింది. వీళ్లు దోచుకో.. పంచుకో.. తినుకో అనే సూత్రాన్ని పాటిస్తున్నారు. గజదొంగల ముఠాలో భాగంగా దత్తపుత్రుడు కూడా ఉన్నారు. దుష్టచతుష్టయంలో దత్తపుత్రుడు కూడా కలిశాడు.


ఇప్పుడు కూడా సేమ్ బడ్జెట్‌ పెడుతున్నాం, అదే రాష్ట్రం. అయినా చంద్రబాబు ఎందుకు సంక్షేమ పథకాలు అప్పట్లో పెట్టలేదు? ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వ్యతిరేకం అన్నాడు చంద్రబాబు. మంచి చేశాం, మంచి జరిగిందని అనిపిస్తే మీ బిడ్డకు (జగన్) తోడుగా ఉండండి. మీ ఇంట్లో మంచి జరిగిందో లేదో మీరే చూసుకోండి. మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నీ తీరుస్తున్నాం. 


చంద్రబాబుకు, దత్తపుత్రుడికి సవాల్‌ విసురుతున్నాను. 175కి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం వారికి ఉందా? నా దగ్గర ఎల్లో మీడియా లేదు.. అయినా మేం చేసిన మంచి చెప్పుకునే మళ్లీ అధికారంలోకి వస్తాం’’ అని సీఎం జగన్ అన్నారు. 


రూ.1,090.76 కోట్లు విడుదల


ఈ ఏడాది మూడో విడతగా 51.12 లక్షల మందికి రూ.1,090.76 కోట్లను సీఎం జగన్ జమ చేశారు. వరు­సగా నాలుగో ఏడాదిలో కూడా ఇప్పటికే రెండు విడతల్లో రూ.11,500 సాయం అందించారు. మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ.2 వేల చొప్పున 51.12 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,090.76 కోట్లు వేశారు.