ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చే నిర్ణయాన్ని తాను బాగా ఆలోచించే తీసుకున్నానిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ నిర్ణయం తీసుకొనే ముందు తనను తాను కూడా చాలాసార్లు ప్రశ్నించుకున్నానని, అన్నీ కరెక్ట్ అని అనుకున్నాకే ముందడుగు వేసినట్లుగా చెప్పారు. ఏపీ అసెంబ్లీ ఐదో రోజు సమావేశాల్లో భాగంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సవరణ బిల్లును వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ సందర్భంగా సీఎం జగన్ కూడా మాట్లాడారు. 


‘‘చంద్రబాబుకు ఎన్టీఆర్ తన కుమార్తెను బహుమతిగా ఇస్తే, చంద్రబాబు వెన్నుపోటును రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారు. అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా ఉంటే ఎన్టీఆర్ చాలా కాలం బతికి ఉండేవారు. ముఖ్యమంత్రిగా ఇంకొంత కాలం కొనసాగేవారు. బహుశా చంద్రబాబు సీఎం అయ్యేవారు కాదేమో. ఎన్టీఆర్ పై నేనెప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. ఆయనపై నాకు చంద్రబాబు కన్నా ఎక్కువ మమకారమే ఉంది. గత ప్రభుత్వ హాయంలో ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ నుంచి ఎన్టీఆర్ పేరును ఎందుకు తీసేయాలని అనుకున్నారో చెప్పాలి’’ అని సీఎం జగన్ అన్నారు. 


ఆ పథకాలకు ఆద్యుడు వైఎస్ఆర్: జగన్
‘‘వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, 108, 104 పథకాలు రూపొందించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. స్వయంగా డాక్టర్ అయిన ఆయన ఈ పథకాలను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 8 మెడికల్ కాలేజీలు టీడీపీ పుట్టకముందే, 1983 కన్నా ముందే స్థాపితం అయ్యాయి. మిగతా 3 మెడికల్ కాలేజీలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి నెలకొల్పారు. ఇప్పుడు నా హాయాంలో మరో 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. మొత్తంగా 27 మెడికల్ కాలేజీల్లో 20 కాలేజీలు వైఎస్ఆర్ వల్లనో, ఆయన కొడుకు అయిన నా వల్లనో ఏర్పాటు అవుతున్నాయి. 1983 నుంచి ఇప్పటిదాకా టీడీపీ హాయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా నిర్మితం కాలేదు.’’ అని సీఎం జగన్ అన్నారు.


అలాంటి పరిస్థితుల్లో టీడీపీ వాళ్లు వాళ్లకి కావాల్సిన పేరును హెల్త్ యూనివర్సిటీకి పెట్టుకున్నారని జగన్ అన్నారు. రాష్ట్రంలో 20 కి పైగా మెడికల్ కాలేజీలు నెలకొల్పేందుకు కారణమైన వైఎస్ఆర్ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పెట్టడంలో తప్పేముందని సీఎం జగన్ ప్రశ్నించారు. క్రెడిట్ ఇవ్వాల్సిన వ్యక్తికి, క్రెడిట్ ఇవ్వాలని సీఎం జగన్ అన్నారు. ఎన్టీఆర్ విషయంలో తనకు ఎలాంటి కల్మషం లేదని సీఎం జగన్ చెప్పారు.


ఆయన గౌరవాన్ని తగ్గించబోం - జగన్


అనవసరంగా గొడవలు చేసి టీడీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోవడం దురదృష్టకరమని సీఎం జగన్ అన్నారు. వాళ్లు కూడా ఈ చర్చ సందర్భంగా ఉండుంటే బాగుండేదని అన్నారు. ‘‘ఎన్టీఆర్‌ అంటే తనకు ఎలాంటి కోపం లేదని అన్నారు. ఏ రోజూ కూడా తాను ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం లేదని అన్నారు. పైగా ఎన్టీఆర్‌ మీద తనకు ఆప్యాయతే ఉందని, ఆయన్ని అగౌరవ పరిచే కార్యక్రమం తన తరపున ఏనాడూ జరగబోదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.