అమరావతి రాజధాని ప్రాంతంలో ఇళ్ళ స్దలాల పంపిణితో పాటుగా టిడ్కో ఇళ్ళ పంపిణీకి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖ పై వైఎస్ జగన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నవ రత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం పై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు  అందించారు. గడచిన 45 రోజుల్లో హౌసింగ్‌ కోసం రూ.1085 కోట్లు ఖర్చు చేశామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటివరకూ 3.70 లక్షల ఇల్లు పూర్తి చేశామని, రూఫ్‌ లెవల్‌.. ఆ పైన నిర్మాణంలో ఉన్నవి 5.01 లక్షల ఇళ్లని అదికారులు నివేదిక లో పేర్కొన్నారు.


త్వరలోనే వీటి నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించిన అధికారులు, మరో 45 రోజుల్లో వీటిని పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రికి వివరించారు.


బేస్ మెంట్ లెవల్ దాటిన ఇళ్ళు లక్షల్లో...


బేస్‌మెంట్‌ లెవల్‌ దాటి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లు 8.64 లక్షలు పైనే ఉన్నాయని అధికారులు ఈ సందర్బంగా వెల్లడించారు. వీటి పనులనూ వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామన్న అధికారులు, సీఎం ఆదేశాల మేరకు జగనన్నకు చెబుదాం స్పెషల్‌ ఆఫీసర్లు కూడా జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణంలో వాడే మెటీరియల్‌ నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తున్నామని సీఎంకు ఇచ్చిన నివేదికలో అధికారులు వెల్లడించారు.


మహిళలకు బ్యాంకుల ద్వారా ఆర్థిక సహయం


ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇళ్ళ లబ్ధిదారులైన మహిళలకు మరింత భరోసాగా బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం తలపెట్టింది.. రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకూ 11.03 లక్షల మందికి రూ.35 వేల చొప్పున రుణాలు ఇచ్చారు. రూ. 3886.76 కోట్ల మేర పావలా వడ్డీకే రుణాలు ఇవ్వటం విశేషం. ఈ విషయంలో అధికారులను సీఎం అభినందించారు.


పేదలకు ఇళ్ళను ఇచ్చి తీరుతాం...


రాజధాని ప్రాంతం అయిన సీఆర్డీయే పరిధిలో పేదలకు ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని, ఎన్ని ఆటంకాలు ఎదురయినా, నాణ్యమయిన పనులు చేపట్టి, లబ్దిదారుల కల సాకారం చేయాలన్నారు.


ఇళ్లపట్టాలు పంపిణీ చేసిన అనంతరం వేగంగా నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లేలా కార్యాచరణ చేయాలన్న సీఎం, ఇళ్లులేని నిరుపేదలకు సాధ్యమైనంత త్వరగా ఇళ్లు కట్టించి అప్పగించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు.పేదలకు ఎంత త్వరగా ఇళ్లు సమకూరిస్తే.. వారి జీవితాలు అంతగా బాగుపడతాయన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. సీఆర్డీయే ప్రాంతంలో పట్టాల పంపిణికీ అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ల్యాండ్‌ లెవలింగ్‌ పనులు మెదలుకొని మిగిలిన అన్ని పనులను త్వరలోనే కొలిక్కి తీసుకురావాలన్నారు. సీఆర్డీయే ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటుగా నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేయాలని సీఎం ఆదేశాలిచ్చారు. 5024 టిడ్కో ఇళ్లను ప్రభుత్వం పంపిణి చేయనుండటం విశేషం. ఇది దేశ చరిత్రలోనే రికార్డుగా సీఎం అభివర్ణించారు. అర్హులను గుర్తించి పారదర్శకంగా ఇళ్ళ పంపిణి చేయటంలో అధికారులు కీలకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు.