‘‘మీరు వెళ్లండి చదవండి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివిస్తాను. చదివినప్పుడే మన బతుకులు, తలరాతలు మారతాయి. ఏ రాష్ట్రంలో లేనట్లుగా మన దగ్గర విద్యా దీవెన అమలవుతోంది. ప్రతి తల్లి, తండ్రి, ఖర్చుకు వెనకాడకుండా మీ బిడ్డలను చదివించండి. మీకు తోడుగా నేను ఉంటాను. ప్రతి ఇంట్లో నుంచి డాక్టర్, ఇంజినీర్, కలెక్టర్ లాంటి పెద్ద చదువులు చదువుకునే నా బిడ్డలు బయటికి రావాలి’’ అని సగర్వంగా చెబుతున్నానని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏ బిడ్డకైనా అతి గొప్ప దీవెన చదువు మాత్రమేనని అన్నారు. బాపట్లలో గురువారం జరిగిన ‘జగనన్న విద్యా దీవెన’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 11.02 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.694 కోట్లను బటన్ నొక్కి ట్రాన్స్‌ఫర్ చేశారు. 


ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద ఇప్పటి వరకు రూ.11,715 కోట్లు నేరుగా అందించాం. చదువుల కోసం ఏ కుటుంబం అప్పులపాలు కాకూడదు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను మేం చెల్లించాం. పిల్లల శిక్షణ కోసం మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం చేసుకున్నాం. అమ్మ ఒడి (Amma Odi), వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద (Jagananna Gorumudda), విద్యాకానుక (Vidyakanuka), విద్యాదీవెన (Vidya Deevena), మనబడి నాడు-నేడు, ఇంగ్లీష్‌ మీడియం, బైజూస్‌తో ఒప్పందం ఇలా విద్యారంగంపై మూడేళ్లలో రూ.53 వేల కోట్లు ఖర్చు పెట్టాం.’’ అని సీఎం జగన్ తెలిపారు.


వారి కడుపు మంటే కనపడుతోంది - జగన్
సంక్షేమ పథకాల డబ్బులను మీ అన్న, మీ తమ్ముడు జగన్ బటన్‌ నొక్కుతున్నాడు, నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయి. తేడా ఏంటి? కేవలం ముఖ్యమంత్రిలో మార్పు. గతంలో ఉన్నవాళ్లు ఇదంతా ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు ఎక్కడా లంచాలు లేవు, ఒక్క డీబీటీ ద్వారా పోతుంది. ఇప్పుడు అప్పుడు.. కేవలం నలుగురు మాత్రమే మూడు మీడియా సంస్థలు, ఒక చంద్రబాబు, వీరికి తోడు ఒక దత్తపుత్రుడు. వీరు మాత్రమే దోచుకో, పంచుకో, తినుకో అంటూ ఉన్నారు.


ఆ మీడియా సంస్థలు చూస్తే వారి కడుపు మంట కనిపిస్తూ ఉంటుంది. గతంలో బాగా దోచుకుని పంచుకునే వాళ్లు. మనం వచ్చాక దోచుకోవడం లేదు, పంచుకోవడం లేదు కాబట్టి.. ఈ మంచి విషయాలు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే వీరి కడుపు కాలడం కనిపిస్తోంది. వారికి లేనివి, నాకు ఉన్నవి.. ఏంటంటే దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులు’’ అని సీఎం జగన్ అన్నారు.


GR Ratio పెంచడమే లక్ష్యం


‘‘2035 నాటికి 70 శాతానికి జీఆర్‌ రేషియోను (GR Ratio) పెంచాలన్నది ధ్యేయం. 2018– 19 తో పోలిస్తే 2019–20లో 8.64 శాతం పెరిగింది. జాతీయ స్థాయిలో 3.04 శాతం మాత్రమే ఉంది. ఆడ పిల్లలకు సంబంధించి రాష్ట్రంలో జీఈఆర్‌ రేషియో 11.04 శాతం వృద్ధి అయితే దేశవ్యాప్తంగా 2.28 శాతం వృద్ధి మాత్రమే ఉంది’’ అని సీఎం జగన్ అన్నారు.