పీఆర్సీ అమలు సహా, ఉద్యోగుల కోసం కొన్ని ప్రకటనలు చేశామన్నారు సీఎం జగన్. కోవిడ్ కారణంగా మరణించిన ఫ్రంట్‌లైన్ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు ఇవ్వడంపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని వివరించారు. యుద్ధ ప్రాతిపదికన కారుణ్య నియామకాలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఖాళీలను వినియోగించుకోవాలని... ఇతర విభాగాల్లో ఉద్యోగాలంటే ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి, అలాంటి సమస్యలు లేకుండా యుద్ద ప్రాతిపదికన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇవ్వాలని సూచించారు.
జూన్ 30లోగా కారుణ్య నియామకాలు పూర్తి చేయాలన్న సీఎం జగన్... అన్ని విభాగాలూ దీనిపై దృష్టిపెట్టాలని సూచించారు. ముందుగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న పోస్టులను ప్రాధాన్యతగా తీసుకుని కారుణ్య నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. ఆలస్యానికి ఆస్కారం ఇవ్వొద్దని కలెక్టర్లకు హితవుపలికారు.
జగనన్న స్మార్ట్‌టౌన్ షిప్స్‌లో 10శాతం స్థలాలను, 20 శాతం రిబేటుపై ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించామని... ఎంఐజీ లే అవుట్స్‌లో వీరికి స్థలాలు ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశించారు సీఎం జగన్. అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలన్నారు. వారికి స్థలాలు కేటాయించేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించాలన్నారు. స్థలాలు కోరుతున్న ఉద్యోగుల పేర్లను రిజిస్ట్రేషన్ చేయాలని తెలిపారు. దీనివల్ల డిమాండ్ తెలుస్తుందని... మార్చి 5లోగా ప్రక్రియ పూర్తికి ఆదేశించారు.
ఉద్యోగులే కాకుండా.. స్థలాలు కోరుతున్నవారి పేర్లను కూడా వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలన్నారు సీఎం జగన్. డిమాండ్‌ను బట్టి... వెంటనే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు స్థల సేకరణకు వీలు ఉంటుందన్నారు. సేకరించిన స్థలంలో 5శాతం స్థలాలను పెన్షనర్లకు రిజర్వ్ చేయాలని పేర్కొన్నారు.
సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని... జూన్ 30 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాలని డెడ్‌లైన్ పెట్టారు సీఎం జగన్. జులై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలని మిగిలిపోయిన 25శాతం ఉద్యోగులు ప్రొబేషన్ పరీక్షలను పూర్తిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్చి మొదటి వారంలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా అధికారులు చెప్పారు. దీనికి అవసరమైన శిక్షణ, సబ్జెక్టుపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు జగన్.
రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు వర్తించే జగనన్న చేదోడు పథకానికి సంబంధించిన నిధులను ఫిబ్రవరి 8న సీఎం జగన్ విడుదల చేయనున్నారు. వరదల్లో నష్టపోయిన రైతులకు ఇచ్చే వైఎస్‌ఆర్ ఇన్‌పుట్ సబ్సిడీ ఫిబ్రవరి 15న విడుదల చేయనున్నారు. ఒక సీజన్‌లో జరిగిన నష్టాన్నిఅదే సీజన్‌లో ఇవ్వాలన్న కాన్సెప్ట్‌తో ఈ పథకాన్ని డిజైన్ చేశారు. డిసెంబర్‌లో రైతులకు జరిగిన నష్టానికి పరిహారం ఫిబ్రవరిలో ఇస్తున్నారు. చిరువ్యాపారులకు వడ్డీలేని రుణం ఇచ్చే పథకం జగనన్న తోడు నిధులను ఫిబ్రవరి 22న విడుదల చేస్తారు. ఇప్పటికే 10లక్షలకు వర్తింప జేశారు. అదనంగా మరో 6 లక్షలమందికి వర్తింప చేయనున్నారు. మార్చి 8న మహిళా దినోత్సవం రోజున విద్యా దీవెన నిధులు.. మార్చి 22న వసతి దీవెన నిధులు విడుదల చేస్తారు.