జగనన్న హౌసింగ్‌ లేఅవుట్‌ల పక్కనే ఇటుకబట్టీలు పెడితే చాలా వరకు ఖర్చు తగ్గుతుందన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించిన ఆయన.. చాలా అంశాలపై దిశానిర్దేశం చేశారు. అందులో ఒకటి జగనన్న హౌసింగ్ పథకం. హౌసింగ్‌ వల్ల ఆర్థిక వృద్ధి పెరుగుతుందన్న జగన్... జిల్లా స్థూల జాతీయోత్పత్తి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు సిమెంటు, స్టీలు వినియోగం పెరుగుతే.. చాలమందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో 15.60 లక్షల ఇళ్లు నిర్మాణం అవుతున్నాయని.. ఇంకా ప్రారంభంకాని ఇళ్లు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. 


ఇళ్ల నిర్మాణం విషయంలో కోర్టు కేసుల పరిష్కారంపై దృష్టిపెట్టాలని కలెక్టర్లకు సీఎం జగన్ సూచించారు. లే అవుట్లలో ఇంకా పనులు ఏమైనా పెండింగ్‌ ఉంటే వెంటనే పూర్తి చేయాలన్నారు. అప్రోచ్‌ రోడ్లు ఏర్పాటుపై తగిన చర్యలకు సూచించారు. విద్యుత్‌ లైన్లు ఏర్పాటు, గోదాములు నిర్మాణం పూర్తి కావాలని దిశానిర్దేశం చేశారు. మార్చి 31లోగా మొదటి విడతలో అన్ని ఇళ్ల నిర్మాణం ప్రారంభం కావాలని... పనులు మొదలుకాని ఇళ్లు అంటూ ఉండకూడదని ఆదేశించారు. 


ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు అధికారులు చేదోడుగా నిలవాలని సీఎం జగన్ హితవుపలికారు. బ్యాంకర్లతో మాట్లాడి లబ్ధిదారులకు రూ.35 వేల రుణాలు వచ్చేట్టు చేయాలన్నారు. వారికి అవసరమైన సామగ్రి అందేలా చర్యలు తీసుకోవాల్నారు. సబ్సిడీపై సిమెంటు, స్టీలు, ఇసుక అందిస్తున్నామన్నాని అన్నీ సక్రమంగా లబ్ధిదారులకు చేరేలాలని చెప్పారు. 


3.27 లక్షల మంది ఆప్షన్‌ 3 కేటగిరీ ఎంచుకున్నారని... ప్రభుత్వమే నిర్మించాలంటూ ఆప్షన్‌ ఎంచుకున్ఉంన లబ్ధిదారుల్లో ఇంకా కొంతమంది గ్రూపులుగా ఏర్పాటు కాలేదని తెలిపారు సీఎం జగన్ వీరిలో 3.02 లక్షలమంది గ్రూపులుగా ఏర్పాటయ్యారు. కేవలం 25,340 మంది గ్రూపులుగా ఏర్పాటు కాలేదు. ఈగ్రూపులు వెంటనే ఏర్పాటయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంటనే పనులు మొదలుపెట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు జగన్. 


కలెక్టర్లు ప్రతి వారం ఒక లే అవుట్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలని జగన్ ఆదేశించారు. జేసీలు, మున్సిపల్‌ కమిషనర్లు స్థాయి అధికారులు వారానికి ఒకసారి తనిఖీ చేపట్టాలన్నారు. జేసీ, హౌసింగ్‌కు సంబంధించిన అధికారి, ఆర్డీఓ, సబ్‌కలెక్టర్లు వారానికి నాలుగు సార్లు తనిఖీ చేయాలని చెప్పారు. ఇళ్ల నిర్మాణంలో ఖర్చును తగ్గించడంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు.


లే అవుట్ల సమీపంలోనే ఇటుక తయారీ యూనిట్లు పెట్టాలని చెప్పారు. 500 ఇళ్లకంటే ఎక్కువ ఉన్న లే అవుట్లలో తప్పనిసరిగా గోడౌన్లు ఏర్పాటుకు కూడా సూచించారు. దీనివల్ల ఇళ్ల నిర్మాణ ఖర్చు నియంత్రణలో ఉంటుందని అభిప్రాయపడ్డారు. 


21 డిసెంబరున ప్రారంభించిన జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ఉగాది వరకు పొడిగించినట్టు జగన్ చెప్పారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు పూర్తి హక్కులు లభిస్థాయిని పునరుద్ఘాటించారు. లబ్ధిదారుల్లో అవగాహన కల్పించి డాక్యు మెంట్లు ఉన్న ఆస్తికీ, డాక్యుమెంట్లు లేని ఆస్తికీ ఉన్న తేడా వివరించాలన్నారు. డాక్యుమెంట్ల లేకపోతే దక్కాల్సిన విలువలో 25శాతమో, 30శాతానికో కొనుగోలు చేసి.. వారికి దోపిడీ చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. పూర్తి హక్కులు ఉంటే వారి ఆస్తికి మంచి విలువ ఉంటుందని జగన్ అభిప్రాయపడ్డారు. 


గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లబ్ధిదారులు ఓటీఎస్‌ కింద రుసుము చెల్లించడానికి 2 వాయిదాల అవకాశం కూడా కల్పించామని.. ఒక వాయిదాలో రూ.5వేలు, ఇంకో వాయిదాలో రూ.5వేలు కట్టి పూర్తి హక్కులను పొందవచ్చన్నారు జగన్. ఆస్తి బదలాయింపు జరిగిన వారికీ కూడా ఇలాంటి అవకాశాలే ఇచ్చామని పేర్కొన్నారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ఇప్పటివరకూ 9.41లక్షలమంది వినియోగించుకున్నారని.. 2.8 లక్షల మందికి రిజిస్ట్రేషన్‌ పూర్తైనట్టు తెలిపారు. 
మిగిలిన వారికీ కూడా రిజిస్ట్రేషన్‌ చేసి వారికి డాక్యుమెంట్లు వెంటనే ఇవ్వాలని జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీనిపై జాప్యం ఉండకూడదన్నారు. 


ప్రత్యేక క్యాంపులు నిర్వహించి లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ పత్రాలు అందించాలని జగన్ సూచించారు. మండలాల వారీగా క్యాంపులు నిర్వహించి వారికి రిజిస్ట్రేషన్‌ పత్రాలు అందించాలన్నారు. 


ఇప్పటివరకూ 30 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చామని జగన్ వివరించారు. ఆ తర్వాత 2,01,648 అప్లికేషన్లు ప్రాసెస్‌ చేశామని ఇందులో 1,05,322 మందికి భూములు గుర్తించినట్టు పేర్కొన్నారు. 91,229 మందికి పట్టాలు ఇచ్చారు. భూమి బదలాయింపు విధానాన్ని వాడుకుని పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వడంపై కలెక్టర్లు దృష్టిపెట్టాలన్నారు. మిగిలిన 96,325 మందికి పట్టాలు ఇవ్వడానికి కలెక్టర్లు అన్ని చర్యలూ తీసుకోవాలని జగన్ సూచించారు.