అనంతపురం జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం తాడేపల్లి నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా అమూల్ సంస్థతో రెండు ఒప్పందాలపై సీఎం సంతకాలు చేశారు. ఈ ఒప్పందాల్లో భాగంగా అమూల్‌ సంస్థ ద్వారా రాష్ట్రంలోని అంగన్‌వాడీలకు ఇకపై ఏపీలోనే తయారైన పాలు, బాలామృతాన్ని పూర్తిస్థాయిలో పంపిణీ చేయనున్నారు.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. ‘‘అనంతపురం జిల్లాలోని 85 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువకు అమూల్‌ శ్రీకారం చుడుతోంది. ఇది మంచి పరిణామం. వ్యవసాయానికి పాడి రైతులు తోడైతేనే గిట్టుబాటు ధర లభిస్తుంది. పాలు పోస్తున్న మహిళలే అమూల్‌కు యజమానులు. ప్రైవేటు డైరీల కన్నా ఎక్కువ రేటు ఇచ్చి అమూల్ సంస్థ పాలు కొనుగోలు చేస్తుంది. పాల ప్రాసెసింగ్‌లో అమూల్‌కు అపార అనుభవం ఉంది.’’


‘‘అమూల్ సంస్థ పాల నుంచి నేరుగా చాక్లెట్లు తయారు చేస్తోంది. ప్రపంచ సంస్థలతో పోటీ పడుతోంది. లాభాలను కూడా బోనస్‌ రూపంలో ప్రతి ఆరు నెలలకోసారి అమూల్‌ ఇస్తోంది. ఇప్పటికే ప్రకాశం, వైఎస్సార్‌ కడప, చిత్తూరు, గుంటూరు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో జగనన్న పాలవెల్లువ కార్యక్రమం కొనసాగుతోంది. కొత్తగా అనంతపురం జిల్లాలో ప్రారంభిస్తున్నాం. అనంతపురం జిల్లాకు ఇదొక మంచి శుభవార్త. పాడి రైతుకు లీటర్‌కు రూ. 5-20వరకు అదనపు ఆదాయం వస్తోంది. రాష్ట్రంలో బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్‌లు ఏర్పాటు చేస్తున్నాం. అమూల్‌ వచ్చిన తర్వాత ప్రైవేట్‌ కంపెనీలు రేటు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. పాల సేకరణలో జరిగే మోసాలపై ప్రత్యేక దృష్టి సారించాం’’ అని సీఎం జగన్‌ అన్నారు.


రాష్ట్రంలో సహకార రంగాన్ని గత ప్రభుత్వం నీరు గార్చిందని జగన్ ఆరోపించారు. తన పాదయాత్రలో ప్రతి జిల్లాలోనూ రైతులు వచ్చి వాటర్‌ బాటిల్‌ చూపించేవారని.. వాటర్‌ బాటిల్‌ ధర రూ.23 అయితే, లీటరు పాలు కూడా అంతకన్నా తక్కువకే కొనుగోలు చేసేవారని రైతులు చెప్పేవారని జగన్ అన్నారు. మినరల్‌ వాటర్‌కు ఇచ్చే రేటు కూడా పాలు పోసే రైతుకు ఇచ్చేవాళ్లు కాదని అన్నారు. రాష్ట్రంలో పాలు సేకరించే ప్రతి చోటా బీఎంసీలను ఏర్పాటు చేస్తున్నామని, ఏఎంసీలను కూడా ఏర్పాటు చేస్తామని జగన్ తెలిపారు. అమూల్‌ విస్తరించే కొద్దీ.. ప్రతి గ్రామంలో ఇవన్నీ పెట్టుకుంటూ వెళ్తామని అన్నారు. పాలు పోసిన వెంటనే ఎన్ని లీటర్లు పోశారు.. ఎంత ధర వస్తుందనే విషయాన్ని వెంటనే రశీదు కూడా ఇస్తారని అన్నారు. నేరుగా క్వాలిటీ టెస్టింగ్‌చేసే అవకాశం కూడా కనిపిస్తుందని పేర్కొన్నారు.’’ అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.