ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పుట్టిన రోజు సందర్భంగా ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ విద్యను ప్రవేశపెట్టడంలో భాగంగా ప్రముఖ లెర్నింగ్ యాప్ బైజూర్‌తో జట్టు కట్టి ఈ కార్యక్రమం చేపట్టారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలోని ఆలపాటి వెంకట రామయ్య జెడ్పీహెచ్‌ఎస్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ద్వారా సీఎం జగన్ ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఆ ట్యాబ్‌లలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు సంబంధించిన పాఠాలతో బైజుస్‌ కంటెంట్‌ నిక్షిప్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు.


‘‘ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్‌ విప్లవాన్ని మొదలు పెట్టాం. సమాజంలో ఉన్న అంతరాలు తొలగిపోవాలి. పేద విద్యార్థులకు ఇంగ్లీష్‌ మీడియం, డిజిటల్‌ విద్య అందకూడదనే పెత్తందారీ విధానం చూసి బాధ కలిగింది. చదువులో సమానత్వం ఉండాలనే ఉద్దేశంతో పిల్లల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర విద్యారంగంలోనే విప్లవాత్మకమైన రోజు. నా పుట్టిన రోజు సందర్భంగా కొత్తశకానికి నాంది పలుకుతున్నాం. ఇందుకు బైజూస్ సంస్థకు ధన్యవాదాలు. వారు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఈ మేలు చేస్తున్నారు’’


‘‘పిల్లలకు అందించిన ట్యాబ్‌లలో బైజూస్‌ కంటెంట్‌ ఫీడ్ చేసి అందిస్తున్నాం. రూ.686 కోట్ల విలువ గల 5,18,740 ట్యాబ్‌లు 8వ తరగతి విద్యార్థులు అందరికీ పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లు, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఇందుకు అర్హులు. ఇంటర్నెట్‌తో సంబంధం లేకుండా వీడియో పాఠాలను ఆఫ్‌లైన్ లో కూడా చూసే వెసులుబాటు కల్పిస్తున్నాం. ఇకపై ఏటా 8వ తరగతిలోకి వచ్చిన విద్యార్థులందరికీ ట్యాబ్‌లు అందిస్తాం. ట్యాబ్‌ల ద్వారా విద్యార్థులకు సులువుగా పాఠాలు అర్థమవుతాయి. అందుకు అనుగుణంగానే కంటెంట్‌ ఉంటుంది’’


ఉపాధ్యాయులకు కూడా ట్యాబ్‌లు


‘‘బైజూస్‌ లెర్నింగ్‌ యాప్‌తో లెక్కలు, జియాలజీ, సివిక్స్‌, హిస్టరీ, ఫిజిక్స్‌, జువాలజీ, బయాలజీ పాఠాలు తెలుగు, ఇంగ్లీష్‌, హిందీతో పాటు 8 భాషల్లో ఉంటాయి. 2 నుంచి 4 నిమిషాల నిడివితో యానిమేషన్‌, వీడియోల రూపంలో పాఠాలు ఉంటాయి. మొత్తం 4,59,564 మంది విద్యార్థులు.. 59,176 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు అందిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులపాటు ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతుల మీదుగా 9,703 స్కూళ్లలో బ్యాబ్‌ల పంపిణీ ఉంటుంది’’ అని సీఎం జగన్ తెలిపారు.


‘‘పలకల చదువులతోనే కొన్ని తరాల విద్యాభ్యాసం ముగిసిపోయింది. ట్యాబులు, డిజిటల్‌ మీడియం అందుబాటులో ఉన్న సమాజాన్ని మనం ఆమోదించవద్దా? నా దళిత సోదరుడి నియోజకవర్గంలో ఈ పథకం ప్రారంభిస్తున్నాను. ప్రభుత్వం, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న వారికి ట్యాబులు ఇస్తు్న్నాం. వీళ్లంతా 10వ తరగతి పరీక్షలు రాసే సమయానికి సుశిక్షితులను చేసేందుకు ఈ ట్యాబులు ఇస్తున్నాం.


మూడేళ్ల వారంటీ


ట్యాబులకు మూడు సంవత్సరాల వారెంటీ ఉంటుంది. మనం ఇచ్చే టెక్నాలజీ వల్ల పిల్లలకు మంచి జరగాలి తప్ప చెడు జరక్కూడదు. ఇదే ఆలోచనతో ఎండీఎం సాఫ్ట్‌వేర్‌ పెట్టారు. దీనివల్ల ట్యాబుల్లో పాఠాలు, లెర్నింగ్‌కు సంబంధించిన అంశాలు మాత్రమే చూడగలుగుతారు. పిల్లలకు నష్టం కలిగించే కంటెంట్‌ను మీ మేనమామ కత్తిరిస్తున్నాడు. పిల్లలు, ఏంచూశారు, ఏం చదివారు అన్నది తల్లిదండ్రులకు, టీచర్లకు ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా తెలుస్తుంది. 


ట్యాబుల్లో లెర్నింగ్ కంటెంట్ మాత్రమే


ట్యాబులు మిస్‌యూజ్‌ అయ్యే అవకాశాల్లేవు, ట్యాబుతో సహా కంటెంట్‌తో కలిపి దాదాపు రూ.32వేలు ఇచ్చినట్టు అవుతుంది. బైజూస్‌ తన కంటెంట్‌ను సీఎస్‌ఆర్‌ కింద ఉచితంగా ఇచ్చింది. దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆరవ తరగతి నుంచి 12వ తరగతి వరకూ ప్రతి క్లాసులోనూ డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయబోతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి పైతరగతి వరకూ ప్రతి సెక్షన్‌లోనూ డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌ కాబోతున్నాయి. నాడు – నేడు కింద మొదటి దశలో పనులు పూర్తి చేసుకున్న తరగతి గదుల్లో ఐఎఫ్‌పీలు పెట్టి డిజిటల్‌ క్లాస్‌రూమ్స్‌గా మార్బబోతున్నాం. వచ్చే జూన్‌కల్లా వీటి ఏర్పాటు పూర్తవుతుంది’’ అని సీఎం జగన్ వివరించారు.