మార్చి 17న అందరు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ ఓ వర్క్ షాపు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నందున ఇకపై ఆయన పార్టీ పరంగా ప్రజల్లోకి వెళ్లడం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేయనున్నారు. అందుకోసం సీఎం జగన్ త్వరలోనే పల్లె నిద్ర కార్యక్రమం ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించే అవకాశం ఉంది. మంత్రులు పాలనా - పార్టీ వ్యవహారాల పైన మరింత సమర్ధవంతంగా పని చేసేలా సీఎం జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన వారికి ఇంటికి వెళ్లేందుకు గడప గడపకు వైఎస్ఆర్.. కార్యక్రమం చేపట్టారు. అలాంటిదే మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 11 నుంచి ఇంటింటికీ జగన్ స్టిక్కర్ల కార్యక్రమం మొదలు పెట్టనున్నారు.


ఇప్పటికే ఏపీలో రాజకీయపరంగా వ్యూహాలు మారుతూ ఉండడం, టీడీజీ - జనసేన పొత్తు దాదాపు ఖరారు కావటం, లోకేష్ యువగళం పాదయాత్ర, త్వరలో పవన్ కల్యాణ్ వారాహి బస్సు యాత్ర ప్రారంభ ఉన్నవేళ పార్టీ పరంగా ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలపైన మార్చి 17న నిర్వహించే వర్క్ షాపులో సీఎం జగన్ మంత్రులకు సీఎం మార్గ నిర్దేశం చేస్తారని తెలుస్తోంది.  


అప్పట్లో ఆ స్లోగన్, ఇప్పుడిదీ..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రావాలి జగన్ కావాలి జగన్ అనే స్లోగన్ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లింది. ఇప్పుడు మరో స్లోగన్‌ను రూపొందించారు. ఇప్పుడు అదే స్టైల్‌లో మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఈ స్లోగన్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 2019 రావాలి జగన్ కావాలి జగన్... 2024 మా నమ్మకం నువ్వే జగన్ అంటూ అభిమానులు షేర్ చేస్తున్నారు. 


ఏపీలో ఈ నెల 11 నుంచి ఇంటింటికీ జగన్ స్టిక్కర్ల కార్యక్రమం మొదలు పెట్టనుంది వైసీపీ ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ ప్రభుత్వాలను ఏదో ఒక రకంగా అందుకునే ప్రతీ ఇంటికీ సీఎం జగన్ ఫోటో ముద్రించి ఉన్న స్టిక్కర్లను అంటించనున్నారు. జగన్ ఫోటోతోపాటు " మా నమ్మకం నువ్వే జగన్ " అనే స్లోగన్‌ను కూడా ఈ స్టిక్కర్ల లో ఉంటుంది. ఈ స్టిక్కర్లు అంటించే కార్యక్రమానికి గ్రామ వాలంటీర్లు, గృహ సారథులను ప్రభుత్వం వాడుకోనుంది. అయితే ఇంటి యజమాని అంగీకరించిన తరువాత మాత్రమే ఈ స్టిక్కర్‌ను అంటిస్తారని వైఎస్ఆర్ సీపీ చెబుతోంది. దీని ద్వారా సంక్షేమ పథకాల అమలుపై మరింత స్పష్టమైన వివరాలు ప్రభుత్వానికి లభిస్తాయని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి.