అమరావతిలోని ఆర్-5జోన్‌లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. తుళ్లూరు మండలం వెంకటాయపాలెం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. అక్కడే నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడి జగన్.... చంద్రబాబుపై ధ్వజమెత్తారు.
పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న ఆలోచన గత ప్రభుత్వంలో ఎప్పుడైనా చూశారా? అని ప్రశ్నించారు సీఎం జగన్. సీఆర్డీయే ప్రాంతంలో 5,024 మందికి పూర్తైన టిడ్కో ఇళ్లను కూడా అందిస్తున్నామన్నారు. 300 చదరపు అడుగులు ఫ్లాటు కట్టడానికి అయ్యే విలువ దాదాపుగా రూ.5.75లక్షలు. మౌలిక సదుపాయాలకోసం రూ.1 లక్ష అవుతుంది. కేంద్రం లక్షన్నర ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం లక్షన్నర ఇస్తుంది.
మిగిలిన డబ్బులను బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకుని 20 ఏళ్లపాటు లబ్ధిదారుడు కట్టుకోవాలని గత ప్రభుత్వం చెప్పిందన్నారు సీఎం. మొత్తంగా రూ.7.2లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. తాము వచ్చాక ఆ ఫ్లాటును పేదవాళ్లకు పూర్తిగా రూ.1కే రాసిచ్చామన్నారు. అయినా చంద్రబాబు, వారి గజ దొంగల ముఠాకు, ఎల్లోమీడియా వక్రభాష్యాలు చెప్తూనే ఉందన్నారు. చంద్రబాబు తన పాలనలో ఒక్క ఇంటి పట్టాకూడా ఇవ్వలేదన్నారు.
గతంలో చంద్రబాబు 600 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసి అందర్నీ మోసం చేశారన్నారు సీఎం జగన్. ఎన్నికలకు దగ్గరపడే కొద్దీ.. మళ్లీ ఒక మేనిఫెస్టో అంటున్నారన్నారు. సామాజిక వర్గాలు మీద మోసపూరిత ప్రేమ చూపిస్తున్నాడని ఎద్దేవా చేశారు. వారికోసమే మేనిఫెస్టో అని అంటున్నారని విమర్శించారు. మోసం చేసేవాడ్ని ఎప్పుడూ కూడా నమ్మొద్దని పిలుపునిచ్చారు. నరకాసురుడినైనా నమ్మొచ్చు కాని, నారా చంద్రబాబునాయుణ్ని మాత్రం నమ్మకూడదన్నారు సీఎం జగన్.
2014 -2019 వరకూ ఒక ఇళ్లపట్టా కూడా చంద్రబాబు ఇవ్వలేదన్నారు సీఎం. కరోనా కష్టాలు రెండేళ్లు రాష్ట్రాన్ని వెంటాడినా, రాష్ట్రానికి వచ్చే వనరులు తగ్గినా.. మీ కష్టం ఎక్కువే అని భావించి పరుగెట్టామన్నారు. కోవిడ్ సమయంలో కూడా 30 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చామని గుర్తు చేశారు. ఆర్థికంగా ఎన్ని సవాళ్లైనా వచ్చినా సరే నవరత్నాల్లోని ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చామని తెలిపారు. ఇచ్చిన ప్రతీ వాగ్దానం కూడా అమలు చేశామన్నారు. మేనిఫెస్టోలో 98శాతం వాగ్దానాలను అమలు చేశామని వివరించారు. ఇళ్ల నిర్మాణాలను దశలవారీగా నిర్మించుకుంటూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
ఈ నాలుగేళ్ల పరిపాలనలో ఒక్క రూపాయి అవినీతి జరగలదన్నారు సీఎం జగన్. లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.2.11లక్షల కోట్లు జమచేశామని తెలిపారు. చంద్రబాబు, ఆయన దొంగల ముఠా గతంలో దోచుకుందన్నారు. గతంతో పోలిస్తే అప్పుల వృద్ధిరేటు చూస్తే తక్కవేనన్నారు. మరి చంద్రబాబు హయాంలో ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. వారికి మంచి చేసే ఉద్దేశం లేదున్నారు. వారి దృష్టిలో అధికారంలోకి రావడం అంటే దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికేనన్నారు.
ఇవాళ కులాల మధ్య యుద్ధం జరగడంం లేదని క్లాస్ వార్ జరుగుతోందన్నారు సీఎం జగన్. ఒకవైపు పేదవాడు ఉంటే.. మరోవైపే పేదవాళ్లకు మంచి జరగకూడదని పెత్తందార్లు యుద్ధం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. పేదవాడికి ఇళ్లస్థలాలు ఇస్తామంటే కోర్టుల వరకూ వెళ్లి యుద్ధం చేస్తారన్నారు. సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని వాదనలు చేశారని గుర్తు చేశారు.
జగన్ మాదిరిగా పాలన చేస్తే.. రాష్ట్రం శ్రీలంక పోతుందని ఎల్లోమీడియాలో రాస్తోంది చూపుతోందని జగన్ విమర్శించారు. పేదల బ్రతులకు మారాలని పరితపిస్తున్న ప్రభుత్వం తమదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇచ్చిన భూముల్లో కాలనీలు కట్టించి ప్రతీ కాలనీలో అంగన్‌వాడీ, ప్రైమరీ స్కూల్, విలేజ్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, పార్కులు తీసుకొస్తామన్నారు. నవులూరిలోని లేక్‌ను కూడా అభివృద్ధిచేస్తున్నామని వివరించారు.