ఏపీలో తాజాగా జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్తీకరణ తరువాత పలుచోట్ల అధికార పార్టీలో అసంతృప్తి వ్యక్తం అవుతుందనే ప్రచారం పార్టీ నేతల నుండే వ్యక్తం అవుతుంది. ఇప్పటికే సీఎం జగన్ సమన్వయంతో పని చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎన్నికల సమయానికి ఎలాంటి పరిణామాలు ఉంటాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజనికి ఇటీవల మంత్రిగా సీఎం జగన్ ప్రమోషన్ ఇచ్చారు. అయితే ఆమెకు మంత్రి పదవి ఇవ్వకుండా ముందస్తు వ్యూహాలు అమలు చేసిన పార్టీ నేతలకు ఇది తీరని నిరాశను మిగిల్చిందని చెబుతున్నారు. ఎమ్మెల్యే విడదల రజనికి స్థానికంగా ఉన్న వైసీపీ నేత మర్రి రాజశేఖర్ కు మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే, ఇదే సందర్భంగా స్థానిక నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు సామాజిక వర్గాల సమీకరణ నేపద్యంలో మర్రి వర్గానికి సపోర్ట్ చేశారు. చిలకలూరిపేటకు పర్యటనకు వెళ్ళిన సమయంలో కూడా రజని వర్గం ఎంపీని అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న రజనికి సమాచారం ఇవ్వకుండా, మర్రి వర్గానికి సమాచారం ఇవ్వటం, ఆయన ఇంటికి వెళ్ళటంపై అనేకసార్ల వివాదాలు కూడా అయ్యాయి. నడిరోడ్డు మీదనే ఎంపీని నిలిపేసిన సంఘటనలు నెలకొన్నాయి.
అయితే, ఈ నేపథ్యంలో తాజాగా మంత్రిగా రజనికి ప్రమోషన్ వచ్చింది. దీంతో ఎంపీతో పాటుగా మర్రి వర్గం తీవ్ర నిరాశకు గురయ్యింది. ఈ పరిణామంపై జగన్ వద్దనే ఎంపీ నేరుగా ప్రస్తావించినప్పటికీ, సామాజిక వర్గాలు మన పార్టీకి అవసరం కాబట్టి తప్పలేదని, నచ్చచెప్పినట్లుగా ప్రచారం జరుగుతుంది. దీంతో ఎంపీ లావు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే రజని.. ఎంపీని, మర్రి వర్గాన్ని అసలు లెక్క చేయలేదు. ఇప్పుడు మంత్రిగా ప్రమోషన్ వస్తే తమకు అసలు ప్రాధాన్యత కూడా లేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట.
ఈ విషయంపై అధికార పార్టీలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. ఎంపీ అసంతృప్తి విషయాన్ని తెలుసుకున్న పార్టీ నేతలు నేరుగా ఆయన్ను కలిసి నచ్చ చెప్పినట్లుగా చెబుతున్నారు. అయితే, ఈ పరిణామాలపై వైసీపీ పార్టీతో పాటుగా రాజకీయవర్గాల్లో కూడ విస్తృంగా చర్చ నడుస్తుంది. ఇప్పటికే వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణం రాజు పార్టీకి దూరంగా తిరుబాటు ఎగరవేశారు. ఇప్పుడు మరో ఎంపీ కూడా అసంతృప్తితో పార్టీలో ఉన్నప్పటికి పార్టీలో కొనసాగుతున్న తీరుపై కొంత వరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్ పార్టీ ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా సమావేశం పెట్టి 2024 ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించారు.
అసంతృప్తులు, వర్గాలు పక్కన పెట్టి అంతా కలసి పని చేయటం ద్వారా తిరిగి అధికారంలోకి రావాలని కూడా స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో అంతర్గతంగా ఉన్న అసంతృప్తుల వ్యవహరంపై కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీకి ప్రజల్లో ఉన్న ఆదరణ, నేపథ్యంలో సంక్షేమ పథకాలను విస్తృతంగా అమలు చేస్తూ, ఇంటింటికి వెళ్ళి పార్టీ కార్యకలాపాలను వివరిస్తుండటంతో, ఇలాంటి అంతృప్తులు పెద్దగా ప్రభావం చూపించే అవకాశం ఉండదని నేతలు భావిస్తున్నారు.