Chandrababu Reached SIT Office: 


స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబును పోలీసులు తాడేపల్లికి తరలించారు. తాజాగా కుంచనపల్లి సిట్ కార్యాలయానికి చంద్రబాబు కాన్వాయ్ చేరుకుంది. ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ఉండేందుకు అధికారులు, పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. టీడీపీ అధినేత తరలింపుతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.  అంతకుముందే సిట్ ఆఫీసులో చంద్రబాబును విచారించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. అక్కడ చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. చంద్రబును తరలిస్తున్న మార్గంలోనూ రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.


జనసేన ఆఫీసు వద్ద కాన్వాయ్ ని అడ్డుకున్న టీడీపీ శ్రేణులు
ఏపీ మాజీ సీఎం చంద్రబాబును తాడేపల్లిలోని సిట్ ఆఫీసుకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మంగళగిరి హైవేపై.. జనసేన కార్యాలయం వద్ద చంద్రబాబు కాన్వాయ్ ను తెలుగు తమ్ముళ్లు అడ్డుకున్నారు. టైర్లు తగలబెట్టి నిరసన తెలపడంతో కాసేపు చంద్రబాబు కాన్వాయ్ అక్కడ నిలిచిపోయింది. టీడీపీ శ్రేణులు, చంద్రబాబు మద్దతుదారులను పోలీసులు అడ్డుకుని, రూట్ క్లియర్ చేయడంతో కాన్వాయ్ ముందుకు కదిలింది. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. 


నంద్యాలలో ఉదయం 8 గంటలకు బయలుదేరిన చంద్రబాబు కాన్వాయ్ సాయంత్రం దాదాపు ఐదు గంటల సమయానికి తాడేపల్లికి చేరుకున్నారు. నంద్యాల నుంచి సీఐడీ సిట్ కార్యాలయానికి చేరుకోవడానికి దాదాపు 9 గంటల సమయం పట్టింది. ఈ ప్రయాణంలో పలుచోట్ల కాన్వాయ్ ముందుకు కదలకుండా టీడీపీ శ్రేణులు, చంద్రబాబు మద్దతుదారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ నేతను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ రోడ్లపై బైఠాయించారు. కొన్ని చోట్ల రోడ్లపై టైర్లు కాల్చివేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉందని సీఎం జగన్, వైసీపీ నేతలు, కక్షగట్టి చంద్రబాబును వేధింపులకు గురిచేస్తున్నారని టీడీపీ నేతలు, మాజీ మంత్రులు ఆరోపిస్తున్నారు.