Chandrababu Quash Petition: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కీలక పరిణామం జరగనుంది. అసలు కేసులోనే పస లేదంటూ సుప్రీంకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు తీర్పు రానుంది.
ఉత్కంఠగా ఎదురు చూపులు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు(Skill Development Case) నమోదు నుంచి రిమాండ్‌కు తరలించే వరకు చేపట్టిన ప్రక్రియ అంతా న్యాయబద్దంగా లేదంటూ టీడీపీ చీఫ్(TDP Chief) చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఏపీ సీఐడీ వేసిన ఎఫ్‌ఐఆర్ కొట్టేయాలని రిక్వస్ట్ పెట్టుకున్నారు. మొదట ఈ కేసులో క్వాష్ పిటిషన్ ఏపీ హైకోర్టులో వేశారు. అక్కడ ప్రతికూల నిర్ణయం రావడంతో సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు.
హేమాహేమీల వాదనలు
సెప్టెంబర్ 22న క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేయడంతో చంద్రబాబు(Chandra Babu) సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్-17ఏకు వ్యతిరేకంగా తన అరెస్టు జరిగిందని కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినా అక్రమంగా అరెస్టు చేశారని వాదనలు వినిపించారు. చంద్రబాబు తరఫున హరీష్‌సాల్వే(Harish Salve), సిద్ధార్థ లూథ్రా(Sidharth Luthra), ఏపీ సీఐడీ (AP CID)తరఫున ముకుల్ రోహత్గీ(Mukul Rohatgi) వాదనలు వినిపించారు.
17ఏ చుట్టే వాదనలు
ఇరు పక్షాల వాదనలను జస్టిస్ అనిరుద్ధ బోస్(Justice Aniruddha Basu), జస్టిస్ బేలా త్రివేది(Justice Bela Trivedi) ధర్మాసనం కొన్ని రోజుల పాటు వినింది. చంద్రబాబుకు సెక్షన్ 17ఏ(17A) వర్తిస్తుందని ఆయన అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరం అని వాదించారు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఎన్నికల ముందు ఆయన్ని అరెస్టు చేశారని కోర్టుకు వివరించారు. ఇంత వరకు ఈ కేసులో ఎలాంటి సాక్ష్యాలు సీఐడీ కోర్టుకు చూపించలేదని గుర్తు చేశారు. అందుకే కేసును కొట్టేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కౌంటర్
దీనికి కౌంటర్‌గా వాదనలు వినిపించిన రోహత్గీ... 2015-16 సంవత్సరాలకు సంబంధించిన కేసు అని అందుకే 17ఏ చంద్రబాబుకు వర్తించదన్నారు. నేరం జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు(Prima facie) ఉన్నాయన్న కారణంతోనే అరెస్టు జరిగిందని తెలిపారు. కేసు విచారణలో ఉన్నప్పుడు క్వాష్ పిటిషన్ వేయడం సరికాదని పేర్కొన్నారు.
ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేశారు. ఆ కేసు బుధవారం జరిగే ప్రొసీడింగ్స్‌లో లిస్ట్ అయింది. అందుకే దీనిపై కీలక తీర్పు వచ్చే ఛాన్స్ ఉందని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయని బ్లాక్ మనీ చేతులు మారిందని చెబుతూ చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ సీఐడీ సెప్టెంబర్ 9న అరెస్టు చేసింది. నాటకీయ పరిణామాల మధ్య ఆయన్ని అరెస్టు చేసిన సీఐడీ ఉదయానికల్లా విజయవాడ తరలించింది. కోర్టులో ప్రవేశ పెట్టింది. అనంతరం ఆయన్ని రిమాండ్‌కు తరలిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అప్పటి నుంచి 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ మధ్య అంటే అక్టోబర్ 30న ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.