TDP Donations Website: తెలుగు దేశం పార్టీ కోసం విరాళాలు ఇవ్వాలనుకునే వారి కోసం పార్టీ ఓ వెబ్ సైట్ ను ప్రారంభించింది. ఈ వెబ్ సైట్ ను మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో అధినేత చంద్రబాబు ప్రారంభించారు. https://tdpforandhra.com అనే ఈ వెబ్‌సైట్ ద్వారా ఎవరైనా సరే టీడీపీకి విరాళాలు ఇవ్వవచ్చని చంద్రబాబు తెలిపారు. టీడీపీ మద్దతుదారులు, అభిమానులు, ఎన్నారైలు ఎవరైనా సరే ఈ వెబ్ సైట్ ద్వారా డొనేషన్లు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. తొలి విరాళంగా తాను రూ.99,999 రూపాయలను అందిస్తున్నట్లుగా చంద్రబాబు వెల్లడించారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘ఎన్నారైల కోసం వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా అవకాశం కల్పించాం. విరాళాలు ఇచ్చిన వారికి రిసిప్టులు కూడా ఇస్తాం. అమెరికాలోనూ రాజకీయ విరాళాలకు న్యాయపరంగా అనుమతి ఉంది. మేం కేవలం మా కార్యకర్తలు, మద్దతుదారుల నుంచే విరాళాలు తీసుకుంటున్నాం. కానీ, వైసీపీ మాత్రం గ్యాంబ్లర్ల నుంచి కూడా విరాళాలు తీసుకుంది. అందుకే ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌కు అనుమతించాలని సమయం కోసం వైసీపీ ఎదురు చూసింది. ఎన్‌ఆర్‌ఐలు పార్టీకి విరాళాలు ఇవ్వడమే కాదు.. ఏపీకి వచ్చి పార్టీ కోసం, రాష్ట్రం కోసం పని చేయవచ్చు. ప్రజల్లో తెలుగుదేశం ఓ భాగం.
వైసీపీ బారి నుంచి ఏపీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు 3 పార్టీలు కలిసి ముందుకు వస్తున్నాయి. ఇందులో ప్రజలు కూడా భాగం కావాలి. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఒకే ఒక్కడు బాగుపడ్డాడు.. అతని అనుచరులు కూడా లాభపడ్డారు. కానీ, 5 కోట్ల మంది ప్రజలు బాగా నష్టపోయారు. యువత భవిష్యత్తు నాశనం అయింది. ఎన్నికల్లో ప్రచారం ఒక భాగమైతే.. ప్రలోభాలు మరో భాగంగా ఉన్నాయి’’ అని చంద్రబాబు మాట్లాడారు.