Chandrababu Naidu: వైసీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేస్తేనే ప్రజాజీవితం కుదుట పడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రస్తుత వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాల బ్రష్టు పట్టిందని.. వైసీపీ పార్టీనీ బంగాళాఖాతంలో కలపాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. చెరుకుపల్లి మండలం ఉప్పాలవారిపాలెంలో హత్యకు గురైన అమరనాథ్ కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు పరామర్శించారు. బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థి అమర్నాథ్ ను అంత్యంత కిరాతకంగా హత్య చేయడం తనను ఎంతగానే కలచి‌వేసిందని అన్నారు. కరుడు కట్టిన నేరస్థుల మాదిరి అమర్నాథ్ ను సజీవ దహనం చేయడం వైసీపీ నాయకుల ఆగడాలకు పరాకాష్ఠగా తెలిపారు. పోలీసులకు సంఘటన జరిగిన వెంటనే తెలిపినప్పటికీ.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని చెప్పారు. కాలిన గాయాలతో ఉన్న అమర్నాథ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఆక్షేపించారు. దారుణంగా హత్యచేసి ఆత్మహత్యగా చిత్రించే ప్రయత్నం నిందుతులు చేస్తే వారికి సహకరించేదుకు పోలీసులు ప్రయత్నించారని దుయ్యపట్టారు.






నేరుగా ఇళ్లలోకి వెళ్లి అత్యాచారాలు..


తన అక్కను వెంకటేశ్వర రెడ్డి వేదిస్తుంటే.. వేదించ వద్దన్ని అన్నందుకు అంతం చేసేంత ద్యైర్యం రావడానికి వైసీపీ నాయకులే కారణం అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ప్రజలను భయ బ్రాంతులకు గురిచేసి ప్రాణ భయంతో వారిని లొంగిపోయే విధంగా చేసుకొని చాలా ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్తలు నేరుగా ఇళ్లలోకి వెళ్లి మహిళలపై అత్యాచారం చేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఇలాంటి ధారుణ ఘటనలు జరుగుతున్నా సీఎం స్పందించక పోవడం సైకో మనస్తత్వానికి పరాకాష్టని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కు ఆడపిల్లలు లేరా... వైసీపీ నాయకులకు ఇళ్లలో  మహిళలు లేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు  వారికి కూడా జరిగితే ఇదే విధంగా ఉంటారా అని ప్రశ్నించారు. ఆడబిడ్డలకు అండగా ఉండేందుకు పార్టీ నిలబడితే.. వైసీపీ నాయకులు శవరాజకీయం చేస్తున్నారని విమర్శిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. 


అమర్నాథ్ అక్కను దత్తత తీసుకున్న చంద్రబాబు


ఇలాంటి దారుణ ఘటనలు రాష్ట్రంలో  రోజు రోజుకూ పెరిగి పోవడానికి ప్రధాన కారణం గంజాయి వినియోగం అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. గంజాయి కల్చర్, గన్ కల్చర్ రాష్ట్రంలోకి ప్రవేశించాయని అన్నారు. అమర్నాద్ హత్యకు ప్రధాన కారణం స్థానిక  వైసీపీ నాయకుడు జేసీ రెడ్డి అని చంద్రబాబు ఆరోపించారు. ఈ  వ్యక్తి గంజాయి బ్యాచ్ ను మెయింటన్ చేస్తూ.. దాడులు చేసిన, హత్యలు చేసినా నేను చూసుకుంటానని ఇచ్చిన హామీల వల్లే ఈ ప్రాంతంలో అత్యాచారాలు, హత్యలు పెరిగాయన్నారు. బాధిత కుటుంబానికి తాను పరిహారంగా పది లక్షలు ఇస్తున్నానని వివరించారు. కానీ తాను ఇచ్చే డబ్బు బాధితులకు అండ ఇవ్వదని.. పరిహారంతో సరిపెట్టకుండా మృతుడు అమర్నాథ్ అక్కను తాను దత్తత తీసుకుంటాన్నానని తెలిపారు. జగన్ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని వచ్చే ఎన్నికలలో ఈ పార్టీనీ బంగాళాఖాతంలో నిమజ్జనం చేయకపోతే రాష్ట్రనికి  భవిష్యత్తు ఉండదన్నారు. గంజాయి బ్యాచ్ ను కంట్రోల్ చేయడానికి  ఐరన్ హ్యాండ్ అవసరం అని ఆ నేర్పరి వైసీపీ ప్రభుత్వానికి లేదని అన్నారు. ఉదయం 5 గంటలకు దారుణ  సంఘటన జరిగితే తాపీగా 10 గంటలకు సీఐ వచ్చాడని.. భవిష్యత్తులో ఆ సీఐని వదిలి పెట్టబోనని తెలిపారు. ఎక్కడ ఉన్నా రేచుకుక్కలా వెంటాడాతానని స్పష్టం చేశారు.