Andhra Pradesh News: వైసీపీ సభ్యుల తీరుపై ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసహనం వ్యక్తం చేశారు. సభకు రామని చెప్పి దొంగచాటున వచ్చి సంతకాలు చేస్తున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. వాళ్లెవరూ తనకు సభలో మాత్రం కనిపించలేదని అన్నారు. కానీ రిజిస్టర్‌లో సంతకాలు ఉన్నాయని వివరించారు.
వైసీపీ సభ్యులు సభకు రావడం ఎవరైనా చూశారా అని సభ్యులను స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో అడిగారు. ప్రజల ఓట్లతో విజయం సాధించిన ఎమ్మెల్యేలు సభకు రాకపోవడం ఒక తప్పు అయితే... ఇలా దొంగచోట సంతకాలు చేయడం ఏంటని ఆశ్చర్యపోయారు. ఇలా చేయడం వల్ల మంచిది కాదని అన్నారు.
సభకు సీక్రెట్‌గా వచ్చి సంతకాలు చేసిన వారి పేర్లను సభలో చదివి వినిపించారు స్పీకర అయ్యన్న పాత్రుడు. బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, మత్స్యలింగం, విరూపాక్ష, విశ్వేశ్వరరాజు, ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి, దాసరి సుధ కనిపించకుండా వచ్చి సంతకాలు చేసినట్టు తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ఒక్క రోజు మాత్రమే వైసీపీ అధినేత జగన్ సహా ఆపార్టీ ఎమ్మెల్యేలు సభకు వచ్చారు. ఆ తర్వాత కనిపించలేదు. కానీ ఇలా సంతకాలు చేయడం ఏంటని స్పీకర్ ప్రశ్నించారు.
బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ సభకు హాజరుకాలేదని స్పీకర్ ప్రకటించారు. ఇప్పుడు రిజిస్టర్‌లో సంతకాలు చేసిన వారి హాజరు పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. ఇలా చేసి అసెంబ్లీకి, గెలిపించిన ప్రజలకు మచ్చ తేవద్దని ఎమ్మెల్యేలకు స్పీకర్ సూచించారు.