AP Police Seva app maintenance work going on- మంగళగిరి: ఎన్నికల సమయం దగ్గర పడిందంటే రాజకీయ నేతలపై మాత్రమే కాదు ప్రభుత్వ విభాగాలపై సైతం దుష్ప్రచారం జరుగుతుంటుంది. అయితే ప్రజలు అధికారులు విడుదల చేసే వివరాలు, చేసే ప్రకటనల్ని మాత్రమే విశ్వసించాలని చెబుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ సేవ యాప్ పనిచేయడం లేదని ప్రచారం జరుగుతోంది. ఏపీ పోలీస్ సేవ యాప్ పనిచేయడం లేదన్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని ఐ‌జి సాంకేతిక విభాగం స్పష్టం చేసింది. 


గత కొన్ని రోజులుగా వివిధ దిన పత్రికలలో ఏ.పి పోలీస్ సేవా యాప్ మీద వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవం, సత్య దూరం అని ఐజీ కార్యాలయం సాంకేతిక విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. పోలీస్ శాఖ సాంకేతిక విభాగం ప్రజల సౌలభ్యం కోసం కొన్ని సేవలను/సదుపాయాలను పోలీస్ వెబ్‌సైట్, ఏపీ పోలీస్ సేవా ఆప్ ల ద్వారా అందిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దాంతో రాష్ట్ర పోలీస్ సేవాల యాప్ లో ప్రస్తుతం కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. అదే సమయంలో ప్రజలకు ఏ సమస్య లేకుండా చూసేందుకు, యాప్ ద్వారా అందించే సేవలను వెబ్ సైట్ ద్వారా అందిస్తున్నారు. ఇందులో ఎటువంటి ఇతరత్రా అనుమానాలకు ఆస్కారం లేదని పోలీసులు స్పష్టం చేశారు.


ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చెయ్యడం, కేసు వివరాలను ప్రజలు ఈజీగా తెలుసుకోవచ్చు. ఎఫ్ఐఆర్ లకు సంభందించిన సేవలను పోలీస్ వెబ్‌సైట్ ద్వారా ఎటువంటి అంతరాయం లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కనుక ప్రజలు వాటిని పోలీస్ వెబ్‌సైట్  (citizen.appolice.gov.in) ద్వారా పొందాలని, పోలీస్ సేవా యాప్ పై దుష్ప్రచారం మానుకోవాలని సూచించారు.