మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఒక్కసారి సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఇప్పించండి అంటూ ఆయన పార్టీ పెద్దల్ని వేడుకున్నారు. అది కూడా సామాజిక బస్సు యాత్ర వేదికపైనే ఆయన విన్నవించుకోవడం సంచలనంగా మారింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకోసం చేపట్టిన ఈ యాత్రలో అదే వర్గానికి చెందిన ఓ నేత సీఎం జగన్ అపాయింట్ మెంట్ కూడా తనకు లభించడంలేదని చెప్పుకోవడం నిజంగా విచిత్రమే. అందులోనూ ఆయన ఆషామాషీ నాయకుడు కాదు. గతంలో కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. గుంటూరు జిల్లాలో సీనియర్ నేత. అలాంటి నాయకుడుకి ఇప్పుడు జగన్ దర్శనం దొరకడంలేదనే వార్త సంచలనంగా మారింది. 


డొక్కాకి ఎందుకీ కష్టాలు..
డొక్కా మాణిక్య వరప్రసాద్ కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. తదనంతర రాజకీయ పరిణామాల్లో ఆయన టీడీపీలో చేరారు. 2019లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరారు. వైసీపీలో ఆయనకు మంచి ప్రయారిటీ దక్కుతుందని ఆశించారు. ఆయన ఆశించినట్టుగానే వైసీపీలో ఆయనకు ప్రాధాన్యత లభించింది. తాడికొండ నియోజకవర్గానికి ఆయన్ను సహ ఇన్ చార్జ్ గా ప్రకటించారు సీఎం జగన్. తాడికొండ ఎమ్మెల్యేగా అప్పటికే ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. ఆమె వైసీపీ టికెట్ పైనే గెలిచారు. అయినా కూడా ఆ నియోజకవర్గానికి డొక్కాను ఇన్ చార్జ్ గా ప్రకటించారు. అయితే వారం రోజుల్లోనే ఆ నియోజకవర్గ బాధ్యతలనుంచి ఆయన్ను తప్పించారు. ఆ స్థానంలో మేకతోటి సుచరితకు అవకాశం కల్పించారు. ఇదెక్కడి అన్యాయం అంటూ ఆయన అప్పుడే ప్రశ్నించారు. కానీ అధిష్టానం సైలెంట్ గా ఉంది. డొక్కా కూడా సైలెంట్ అయ్యారు. 


ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతోంది. ఈ దశలో డొక్కా మాణిక్యవరప్రసాద్ కి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందేమో అనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. ఆయన్ను ఎక్కడా పరిగణలోకి తీసుకోలేదు. గతంలో తాడికొండ నియోజకవర్గానికి తనను ఇన్ చార్జ్ గా ప్రకటించిన సమయంలో కూడా ఆయన పొంగిపోలేదు. వాస్తవానికి ఆ ఇన్ చార్జ్ పదవి ఆయన కోరుకోలేదు. కానీ ఎన్నికలకు టైమ్ దగ్గరపడుతున్నా కూడా ఆయనకు సీటు కేటాయించకపోవడంతో అసంతృప్తికి లోనయ్యారు. ఇలా సాధికార యాత్రలో తన అసంతృప్తిని బయటపెట్టారు. 


జగన్ వ్యూహం ఏంటి..?
సీఎం జగన్ పై ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ ఇవ్వడంలేదనే అపవాదు ఉంది. ఎమ్మెల్యేలు కానివారికి ఆయన దర్శనం మరింత కష్టం. అయితే ఎన్నికల వేళ అయినా తమకు సీఎం జగన్ ని కలిసే అవకాశం వస్తుందని చాలామంది ఆశిస్తున్నారు. అయినా కూడా అది సాధ్యం కావడంలేదు. డొక్కా మాణిక్య వరప్రసాద్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆయన మాజీ మంత్రి అయినా, గుంటూరు జిల్లాలో పేరున్న నేత అయినా కూడా ఆయనకి సీఎం జగన్ ని కలిసే అవకాశం రావడం లేదు. దీంతో ఆయన ఇలా బహిరంగ వేదికపై తన అసంతృప్తిని బయటపెట్టారు. సీఎం జగన్ ని కలిసే అవకాశం ఇప్పించండి అంటూ పార్టీ పెద్దల్ని వేడుకున్నారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైసీపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలకు న్యాయం జరిగిందని చెప్పుకోవడం అంతా అసత్యం అని.. డొక్కా మాటలు వింటేనే అది అర్థమవుతోందనే విమర్శలు వినపడుతున్నాయి.