ఏపీలో పీఆర్సీ అంశంపై రగడ కొనసాగుతోంది. తాజాగా ప్రభుత్వం మరోసారి పీఆర్సీ సాధన సమితి నేతలతో భేటీ అయింది. ఈ మేరకు వారితో చర్చలు జరిపేందుకు నియమించిన మంత్రుల స్టీరింగ్ కమిటీ మంగళవారం పీఆర్సీ సాధన సమితి నేతలతో సమావేశం అయింది. ఈ సమావేశంలో ప్రధాన సమస్య అయిన హెచ్‌ఆర్‌ఏ (ఇంటి అద్దె భత్యం) స్లాబ్‌లు, రికవరీ అంశాలపై మంత్రులు పీఆర్సీ సాధన సమితి నేతలతో మాట్లాడనున్నారు. అంతేకాక, జనవరి నెలలో పాత విధానం ప్రకారం వేతనాలు ఇవ్వాలని మంత్రులను కోరినట్లు సమాచారం. పీఆర్సీ నివేదిక సైతం బహిర్గతం చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ స్టీరింగ్ కమిటీ భేటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, బొత్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అంతేకాక, ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి కూడా పాల్గొన్నారు.


మరోవైపు, పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు చేస్తున్న పోరాటానికి వామపక్షాలు మద్దతు తెలిపాయి. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పీఆర్సీపై ఉద్యోగుల ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. పీఆర్సీ అనేది ఎప్పటి నుంచో ఉందని, ఉద్యోగులు కూడా న్యాయబద్దంగానే పీఆర్సీ అమలు చేయాలని కోరుతున్నారని అభిప్రాయపడ్డారు. మంగళవారం ఉదయం విజయవాడలోని దాసరి భవన్‌లో వామపక్షాలు సదస్సు నిర్వహించాయి. 18 నెలలపాటు మిశ్రా కమిషన్ నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తే.. ఇప్పటి వరకు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. కమిషన్ నివేదికను వెంటనే ఉద్యోగులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.


హైకోర్టులో ఉద్యోగులకు ఊరట
ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ కోసం పోరాడుతున్న ఉద్యోగులకు హైకోర్టులో కాస్త ఊరట లభించింది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ చట్ట విరుద్ధమంటూ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోల ఉన్న ‘‘జీతాల రికవరీ’’ అంశాన్ని అమలు చేయవద్దని ఆదేశించింది. ఇప్పటికే ఉద్యోగులకు జీతాలను రికవరీ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. జీతాల్లో రికవరీ అనేది లేకుండా శాలరీ జమ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 


ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో జీతాల రికవరీ అంశం ఉంది. పీఆర్సీలో  ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం 23 శాతంగా నిర్ణయించింది.  అయితే ఇప్పటికే రెండున్నరేళ్ల నుంచి 27 శాతం మధ్యంతర భృతి రూపంలో పొందుతున్నారు. ఇప్పుడు 23 శాతమే ఖరారు చేయడం వల్ల నాలుగు శాతం లోటు పడింది. గత రెండున్నరేళ్ల నుంచి అదనంగా ఇచ్చిన ఈ నాలుగు శాతం మొత్తాన్ని రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని వల్ల ఉద్యోగులతో పాటు పెన్షనర్లు కూడా పెద్ద మొత్తంలో నష్టపోతున్నారన్న ఆందోళన కనిపించింది.