మాజీ మంత్రి, టీడీపీ లీడర్ మాజీ మంత్రి నారాయణ అరెస్టును రాజకీయంగా వాడుకోవాలని టీడీపీ చూస్తోందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. తప్పు చేసిన వారు ఎవరైనా కచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదన్నారు. టెన్త్  పేపర్  లీక్‌కు  సంబంధించి ఇప్పటి వరకు 60 మందిని అరెస్ట్ చేసామన్నారు.


లీక్ అయినప్పటి నుంచి పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి వాస్తవాలు తెలుసుకున్నారన్నారు బొత్స సత్యనారాయణ. వాళ్ల దర్యాప్తులో భాగంగానే నారాయణనను కూడా అరెస్టు చేసి ఉంటారన్నారాయన. ఈ కేసులో ఎంతటి వాళ్లు ఉన్నా అరెస్టులు తప్పవని హెచ్చరించారు.


రాజకీయంగా ఎన్నివిమర్శలు అయినా చేయవచ్చన్న బొత్స సత్యనారాయణ... దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. అవే నిజాలు నిగ్గు తేల్చి దోషులను బోనులో నిలబెడతాయన్నారు. పరీక్ష పేపర్‌లు లీక్ చేసిన వాళ్లను అరెస్టు చేస్తారా.. సన్మానిస్తారా అని బొత్స ప్రశ్నించారు.  


మరో మంత్రి అంబటి రాంబాబు కూడా నారాయణ అరెస్టులో ఘాటుగా స్పందించారు. నారాయణ అరెస్ట్‌లో అంత ఆలోచించడానికి ఏమీ లేదన్నారు. రాష్ట్రంలో అనేక అలజడులకు టీడీపీ కారణమన్న ఆయన... అందుకే ఆ పార్టీ నేతలు జైలుకు వెళ్తున్నారని విమర్శించారు. టెన్త్ పేపర్ లీక్‌లో నారాయణ కాలేజీ కీలకంగా ఉందన్నారు. పేపర్‌ లీక్ చేస్తేనే ఆ కాలేజీలు నెంబర్‌ వన్‌ వస్తాయని... లేకుంటే రావన్నారు. ఆధారాలతో దొరికిపోయారు కాబట్టే నారాయణ అరెస్ట్‌ అయ్యారన్నారు అంబటి. 


మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా నారాయయణ అరెస్టుపై స్పందించారు. పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత చర్యలు తీసుకుంటారన్నారు. దీనిపై రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారాయన. పేపర్‌ లీక్‌ చేసిన వారు ఎంతటి స్థాయి వ్యక్తులైనా చర్యలు తప్పవన్నారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. కుట్రపూరితంగా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేసేందుకే టెన్త్‌ పేపర్ లీక్ చేశారని ఆరోపించారు. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయి రాజకీయా ఆరోపణలు చేయడం ఎంత వరకు కరెక్టని ప్రశ్నించారు విష్ణు.