చంద్రబాబు ఏరోజు అధికారంలో ఉన్నా, కరువు తాండవిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి విమర్శించారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ, చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైసీపీ నాలుగేళ్ల పాలనలో ఎప్పుడు చూసినా, వర్షాలు సాధారణం కంటే ఎక్కువే నమోదయ్యాయన్నారు. అందుకే ఒక్క కరువు మండలం కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదన్నారు. అదే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏటా సగటున 300కు పైగా కరువు మండలాలు ప్రకటించారని విమర్శించారు. 


జోకర్‌ మాటలు
జగన్‌ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో భూగర్భ జలాలు కూడా పెరిగాయని కాకాణి అన్నారు. చంద్రబాబు మాటలు జోకర్‌ను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం రైతులను ఆదుకోవడం చంద్రబాబు ఆరోపించడం సరికాదన్నారు. చంద్రబాబు తన హయాంలో ఎప్పుడు వ్యవసాయాన్ని పట్టించుకోలేదని, ఇప్పుడు అధికారంలోకి వస్తే రైతులకు అన్నదాత కింద ఏటా రూ.20 వేలు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. 2014లో బేషరతుగా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని నమ్మించి రైతుల కడుపు మీద కొట్టిన వ్యక్తి చంద్రబాబు అన్నారు.  


‘మేము మాట నిలుపుకున్నాం’
2019 ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లు మంత్రి చెప్పారు. పెట్టుబడి సాయంగా రైతు భరోసా కింద ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లు ఇస్తామని చెప్పామని, కానీ చెప్పిన దానికంటే ఎక్కువగా ఏటా రూ.13,500 చొప్పున  5 ఏళ్లకు ఇస్తున్నామన్నారు. ఏటా సగటున 12 లక్షల టన్నుల నుంచి 14 లక్షల టన్నుల ధాన్యం అధికోత్పత్తి అవుతోందని మరి వ్యవసాయ రంగం బాగా లేనట్లా? అని ప్రశ్నించారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తే, కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని చంద్రబాబు విమర్శించారని, కానీ దాన్ని సాకారం చేసిన ఘనత వైఎస్సార్‌కు దక్కిందన్నారు. వైసీపీ పాలనలో పగటిపూటే వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్నామన్నారు.  


‘చంద్రబాబు సమాధానం చెప్పాలి’
అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వకుండా చంద్రబాబు మోసం చేశారని, రైతుల పంటలకు బీమా ప్రీమియమ్‌ చెల్లించలేదని, డ్రిప్‌ ఇరిగేషన్‌ బకాయిలు పెట్టి పోయారని ఆరోపించారు. ధాన్యం నుంచి రైతు రథాల వరకు ప్రతి దాంట్లో అవినీతికి పాల్పడిన వ్యక్తి చంద్రబాబు కాదా అంటూ ప్రశ్నించారు.  మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ కింద వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు రూ. 7700 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇటీవల టమాటాల సరఫరా కోసం రూ. 10 కోట్లు ఖర్చు చేశామన్నారు 


‘గతి తప్పిన బాబు సుపుత్రడు’
చంద్రబాబు తన సుపుత్రడు లోకేష్‌ను రోడ్డు మీదకు వదిలాడని, ప్రతి చోటా రైతు సదస్సు అని పెట్టి సీఎం జగన్‌ను తనను తిట్టడం తప్ప రైతులకు తమ ప్రభుత్వంలో చేసినవి చెప్పులేకపోతున్నారని విమర్శించారు. ఎన్నికలు దగ్గరకొస్తున్న సమయంలో దాదాపు 65 శాతం ఉన్న రైతులను ఆకట్టుకోవడానికి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీమా చెల్లించాల్సి వస్తుందని రైతుల  ఆత్మహత్యలను నమోదు చేకుండా ఆదేశించిన నీచమైన వ్యక్తి చంద్రబాబు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.  వైసీపీ ప్రభుత్వం రైతులకు చేసిన దానిపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. కేంద్రం యూనివర్సల్‌ కవరేజ్‌కు ఒప్పుకోవడంతో, ప్రధాన మంత్రి ఫసల్‌బీమా యోజనలో చేరడం జరిగిందని మంత్రి చెప్పారు.