జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సైటైర్లు వేశారు. వారాహి వాహనానికి చంద్రన్న పంది అనే పేరు పెట్టుకుంటే బాగుంటుందని సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ తనపై చేసిన అవినీతి ఆరోపణలను వెంటనే నిరూపించాలని, అలా చేసినట్లయితే తాను మంత్రి సహా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అంబటి సవాల్ విసిరారు. 
పవన్ కు అంబటి కౌంటర్...
పవన్ కళ్యాణ్ వైసీపీపై విమర్శలు చేసినట్లు కనిపించినా ఆయన ఇచ్చిన సందేశం వేరని మంత్రి అంబటి అన్నారు. సత్తెనపల్లి నుంచి పవన్ కళ్యాణ్ బీజేపీకి డైరెక్ట్‌గా ఒక మెసేజ్ పంపించారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి వెళ్తానని స్పష్టం చేశారని అంబటి తెలిపారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబును గెలిపించటానికి గాడిదలా మోస్తానని పవన్ ప్రకటించారని వ్యాఖ్యానించారు. మీరు కూడా నాలానే గాడిదలా చంద్రబాబును గెలిపించే బరువును మోయాలంటూ, క్యాడర్ కు పిలుపునిస్తున్నారని... ఈ వ్యూహాన్ని జనసేన పార్టీ కార్యకర్తలు అర్ధం చేసుకోవాలన్నారు అంబటి.
పవన్‌కు విడిపోవటం అలవాటే...
జనసేనాని పవన్ కళ్యాణ్‌కు చాలా మందితో విడిపోవటం అలవాటేనని అంబటి అన్నారు. అధికారం రాని కులాలకు అధికారంలోకి తీసుకుని రావటమే జనసేన లక్ష్యంగా పవన్ చెప్పారని గుర్తుచేశారు. ఈ విషయంలో పవన్ వైఖరి శభాష్ అని అన్నారు. అయితే ఇదే మాట మీద పవన్ కళ్యాణ్ ఉంటాడా అని ప్రశ్నించారు. చంద్రబాబు దగ్గర పదో, పరకో తీసుకుని పొత్తులతో సర్దుకుంటారా.. సొంతంగా బరిలోకి దిగే అవకాశం ఉందా అని ఎద్దేవా చేశారు. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చేసిన వ్యాఖ్యలు పాటించవా అని పవన్ కళ్యాణ్‌ను నిలదీశారు. సన్నాసి చేయడం అవసరమా.. చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని రాజకీయాలు చేస్తున్న వ్యక్తివి అంటూ అంబటి తీవ్ర ఆరోపణలు చేశారు.





పవన్ వాహనంపై అంబటి ఫైర్...
వారాహి అని ప్రచార వాహనాన్ని సిద్ధం చేసుకున్న పవన్ పై అంబటి సైటైర్లు వేశారు. ఆలూ లేదూ చూలు లేదు... సామెత చందంగా ఉందని ఎద్దేవా చేశారు. వారాహి అంటే అమ్మవారి శక్తి స్వరూపం... దశావతారాల్లో ఒక అవతారమని, అటువంటి పవిత్రమైన పేరు పెట్టిన వాహనం ఎక్కి కుట్రలు చేస్తే అమ్మవారు ఊరుకోరని అన్నారు. రాజకీయ నాయకుడిగానే కాదు నటుడిగా కూడా భ్రష్టు పట్టిపోతావ్ అంటూ మండిపడ్డారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ షేప్ అవుట్ అయిపోయాడని, వారాహి పేరు మార్చి వరాహం అని పెట్టుకుంటే కొంతైనా మంచి జరిగే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు. అమరావతిలోని దొంగ రైతులు అరసవిల్లి యాత్రకు చేస్తాం అన్నప్పుడే తాను హెచ్చరించానని, అరసవిల్లి సూర్య భగవానుడు రానివ్వడు‌... ఈ యాత్ర జరగదు అన్నానని అదే జరిగిందని ఇప్పుడు పవన్ విషయంలో కూడ అదే జరుగుతుందని అంబటి వ్యాఖ్యానించారు





రాజీనామా చేస్తా...
పవన్ కళ్యాణ్ తనపై చేసిన అవినీతి ఆరోపణలను వెంటనే నిరూపించాలని అంబటి సవాల్ విసిరారు. పవన్ ఆధారాలతో సహా నిరూపిస్తే తన మంత్రి పదవికి, శాసన సభ్యుత్వానికి కూడ రాజీనామా చేస్తానని అంబటి అన్నారు. అత్మహత్య చేసుకున్న గుర్తింపు కార్డు కలిగిన కౌలు రైతులకు ప్రభుత్వం చెక్కు రూపంలో 7లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తుంటే, అందులో 2 లక్షల రూపాయలు తాను లంచం తీసుకోవటం ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. అదే జరిగితే సీఎం జగన్ తనను ఇప్పటివరకు ఉపేక్షించేవారా అని అంబటి ప్రశ్నించారు. పవన్ తాను ఆరోపణలు చేసి పరారయితే సరిపోదని, నిరూపించాల్సిన బాధ్యత పవన్ పై ఉందన్నారు.