High Court On MLA Pinnelli Bail Petitions: పల్నాడు జిల్లా రాజకీయాలు రోజుకో మలుపుతిరుగుతున్నాయి. తాజాగా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy)కి బెయిల్ వస్తుందా? లేదా అనే ఆసక్తి జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడింది. టీడీపీ ఏజెంట్ (TDP Agent) నంబూరి శేషగిరిరావు (Namburi Seshagiri Rao)పై దాడి, ఈవీఎం ధ్వంసం, కారంపూడిలో సీఐపై దాడి ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టాయి. అయినా ఆయన మాత్రం అజ్ఞాతంలో ఉంటూనే ముందుస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టు (AP Highcourt)లో మూడు పిటిషన్లు దాఖలు చేశారు. మూడు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు మంగళవారం తీర్పు వెలువరిస్తామని పేర్కొంది.
పిన్నెల్లి తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఉద్దేశపూర్వకంగానే పిటిషనర్‌పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. ఈవీఎంను పగలగొట్టిన కేసులో జూన్ 6 వరకు అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నెరవేరకుండా పోలీసులు టీడీపీ నేతలతో కలిసి రోజుకో కేసు పెడుతున్నారని వాదించారు. పోలీసుల తరఫున పీపీ వై.నాగిరెడ్డి వాదనలు వినిపించారు. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించే సమయంలో హైకోర్టు విధించిన షరతులను పిన్నెల్లి ఉల్లంఘించారని వాదించారు. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని పల్నాడు ఎస్పీ నుంచి తనకు సూచనలు అందాయన్నారు. పిన్నెల్లి తీవ్ర నేరాలకు పాల్పడ్డారని నాగిరెడ్డి కోర్టుకు తెలిపారు. ఓట్ల లెక్కింపు రోజున పిన్నెల్లి అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని, ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా ముగియాలంటే మధ్యంతర బెయిలు మంజూరు చేయవద్దని కోరారు.
సీఐ నారాయణస్వామి తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. హత్యాయత్నం వంటి తీవ్ర నేరాలకు సంబంధించిన కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిందని గుర్తు చేశారు. పిన్నెల్లికి నేర చరిత్ర ఉందని, బెయిలు మంజూరు సమయంలో పిన్నెల్లి నేర చరిత్రను సైతం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ పిన్నెల్లి ఇదే తరహా నేరాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తరచూ నేరాలకు పాల్పడే వ్యక్తికి బెయిల్ మంజూరు చేయొద్దని కోరారు.
ఈవీఎం ధ్వంసం కేసులో బెయిల్
ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణా రెడ్డిని అరెస్ట్ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. దీంతో పిన్నెల్లి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల కౌంటింగ్ ముగిసిన మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ అభ్యర్థులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఈసీని ఆదేశించింది. అలాగే సాక్షులను ప్రభావితం చేయొద్దంటూ పిన్నెల్లికి షరతు విధించింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది.