చంద్రబాబు నిందితుడిగా ఉన్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌పై కోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలువుతున్నాయి. అటు ఏపీ హైకోర్టు.. ఇటు విజయవాడ ఏసీబీ  కోర్టులోనూ చంద్రబాబు తరపు లాయర్లు పిటిషన్లు వేస్తూనే ఉన్నారు. క్వాష్‌ పిటిషన్లు, బెయిల్‌ పిటిషన్లు, ముందస్తు బెయిల్‌ పిటిషన్లు.. ఇలా కోర్టుల చుట్టూ తిరుగుతూనే  ఉన్నారు. ఇవి చాలవన్నట్టు.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ కూడా స్కిల్‌ స్కామ్‌ కేసుకు సంబంధించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును సీబీఐకి అప్పగించాలని పిల్‌ వేశారు. అయితే ఈ పిల్‌పై విచారణ జరిపేందుకు హైకోర్టు సీజే బెంచ్‌ అభ్యంతరం తెలిపింది. మరో బెంచ్‌కు బదిలీ  చేయాలని ఆదేశించింది. దీంతో ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వేసిన పిల్‌ మరో బెంచ్‌కు బదిలీ అవుతోంది.


స్కిల్ డెవలప్‌మెంట్ కేసును సీఐడీతో కాకుండా సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈనెల 22న ఏపీ హైకోర్టులో  ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. దీంతో.. ఈ పిటిషన్ హైకోర్టు సీజే బెంచ్‌ ముందు వచ్చింది. కానీ...  సీజే బెంచ్‌లోని జస్టిస్‌ రఘునందన్‌రావు నాట్‌ బిఫోర్‌ మి అన్నారు. దీంతో.. మరో బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేశారు సీజే. దీంతో.. పిల్‌  మరో  బెంచ్‌కు బదిలీ కాబోతుంది. అయితే.. ఏ బెంచ్‌కు బదిలీ చేస్తారన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. నేడో, రేపో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించింది మాత్రమే కాదని... రెండుమూడు రాష్ట్రాలకు విస్తరించి ఉన్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌  అంటున్నారు. ఆర్థిక పరమైన నేరంతోపాటు జీఎస్టీ ఎగవేత, నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ కేసును ఇప్పటికే ఈడీ విచారిస్తున్న విషయాన్ని  కూడా తన పిటిషన్‌లో పేర్కొన్నారు ఉండవల్లి అరుణ్‌కుమార్‌. ఇది.. పెద్ద స్కామ్‌ కనుక సీఐడీతో కాకుండా... సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని ఆయన కోరుతున్నారు.
 
స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ చంద్రబాబును ఈనెల 9న అరెస్ట్‌ చేసింది ఏపీ సీఐడీ. ప్రస్తుతం ఆయన రిమాండ్‌ ఖైదీగా రాజమండ్రి జైల్లో ఉన్నారు. అక్టోబర్‌ 5వ తేదీ వరకు  చంద్రబాబుకు జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు. చంద్రబాబుకు బెయిల్‌ ఇప్పించేందుకు ఆయన తరపు లాయర్లు తీవ్రంగా కృషిచేస్తున్నారు కోర్టుల్లో  పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. మరోవైపు రాజకీయ కక్షతోనే  చంద్రబాబు అరెస్ట్‌ చేశారని టీడీపీ, చంద్రబాబు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రజల సొమ్ము  తినాల్సి అవసరం తమకు లేదని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రకటించారు. జైల్లో చంద్రబాబు సరైన సౌకర్యాలు కూడా కల్పించకుండా మానసిక క్షోభకు  గురిచేస్తున్నారని ఆమె వాపోయారు. మరోవైపు టీడీపీ ఆరోపణలను వైఎస్‌ఆర్‌సీపీ నేతలు తిప్పి కొడుతున్నారు. ఇక... స్కిల్‌ స్కామ్‌లో ఏపీ హైకోర్టులో పిల్‌ వేసిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సీబీఐతో నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని ఏపీ హైకోర్టును అభ్యర్థిస్తున్నారు.