ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 9గంటలకు ప్రశ్నోత్తరాలతో సభ మొదలైంది. ఆ తర్వాత విద్యారంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులపై శాసనసభలో చర్చించారు. గత ప్రభుత్వం విద్యను వ్యాపారంగా మారిస్తే... సీఎం జగన్‌ విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ  తీసుకున్నారని చెప్పారు వైసీపీ సభ్యులు. విద్యారంగం రాష్ట్ర అభివృద్ధి కీలకమన్నారు. డిజిటల్‌ విద్యాను పేదవారికి చేరువ చేసిన నాయకుడు సీఎం జగన్‌ అని కొనియాడారు.  అమ్మఒడి ద్వారా 42 లక్షల మంది విద్యార్థులకు మేలు జరిగింది. నాడు-నేడు కింద 56 వేల స్కూళ్లను బాగుచేశారు. నాణ్యమైన చదువు అందిచడమే లక్ష్యంగా మార్పులు  తీసుకొచ్చారన్నారు. ఇంగ్లీష్‌ మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్‌ వంటివి మన విద్యారంగాన్ని మార్చాయన్నారు. విద్య తల్లిదండ్రులకు భారం కాకూడదని.. సీఎం జగన్‌ ఎన్నో  సంస్కరణలు చేశారన్నారు. దీని వల్ల పేదవాళ్లకు కూడా విద్య చేరువైందన్నారు. 


ఈరోజు రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది ఏపీ  ప్రభుత్వం. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లు, ఏపీ అప్రోప్రియేషన్ బిల్లులను శాసనసభ ముందు పెట్టనుంది. అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌  కుంభకోణంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. వైద్య ఆరోగ్య రంగంలో సంస్కరణలు, దేవాలయాల అభివృద్ధిపై చర్చించనున్నట్టు సమాచారం. ఇక, ప్రభుత్వ సెక్యూరిటీస్ యాక్ట్  2006ను సవరించాలని కేంద్రానికి కోరుతూ సభలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టనుంది వైఎస్‌ జగన్‌ సర్కార్‌. మూడు అంశాలపై అసెంబ్లీలో స్వల్ప కాలిక చర్చ సాగనుంది.. ఇన్నర్  రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పులో అక్రమాలపై కూడా చర్చ జరగనుంది.. ఆరోగ్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, దేవాలయాల అభివృద్ధి-ప్రభుత్వం తీసుకున్న  చర్యలపై కూడా శాసనసభలో చర్చించనున్నారు. 


ఇక, ఏపీ శాసన మండలి సమావేశాలు కూడా ఇవాళ్టితో ముగియనున్నాయి. మండలి ముందుకు సివిల్ కోర్టుల చట్ట సవరణ బిల్లు రానుంది. స్కిల్ స్కాంపై రెండవ రోజు  కూడా చర్చ జరగనుంది. వైద్య, ఆరోగ్య రంగాల్లో అభివృద్ధిపై కూడా చర్చించనున్నారు. మరోవైపు.. ప్రభుత్వ సెక్యూరిటీస్ యాక్ట్ 2006ను సవరించాలని కేంద్రానికి కోరుతూ  మండలిలోనూ తీర్మానాన్ని ప్రవేశ పెట్టనుంది ఏపీ ప్రభుత్వం.


మరోవైపు... అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అక్రమాలను సభలో వివరించే అవకాశం ఉంది. ఈ కేసులో A-1 చంద్రబాబు, A-14 లోకేష్ ఉన్నారు. దీనిపై విచారణ చేపట్టిన సీఐడీ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది.  ఈక్రమంలో... చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని శాసనసభ సాక్షిగా ప్రజలకు వివరించనున్నారు ముఖ్యమంత్రి.