Amaravati Master Plan: అమరావతి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా ప్రభుత్వం వేయిస్తున్న రహదారులను వెంటనే నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. మాస్టర్ ప్లాన్ కు విరుద్ధంగా రోడ్లు వేస్తున్నారని అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకు అన్యాయం జరుగుతుందని, వెంటనే రోడ్ల నిర్మాణం నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని వారు హైకోర్టును కోరారు. ఈ పిటిషన్ ను విచారణ చేసిన హైకోర్టు రోడ్ల నిర్మాణాన్ని నిలిపివేయాలని మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు, సీఆర్‌డీఏను ఆదేశించింది. ముందస్తు సమాచారం లాంటిది ఏమీ ఇవ్వకుండా, అనుమతి లేకుండా మంగళగిరి మండలం నిడమర్రులో తమకు కేటాయించిన ప్లాట్లలో అధికారులు రోడ్లు వేస్తున్నారంటూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. రైతుల తరఫున న్యాయవాది లక్ష్మీనారాయణ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన న్యాయస్థానం వెంటనే నిర్మాణ పనులు ఆపేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు నోటీసులు ఇచ్చి వారి వాదనలు వినాలని తెలిపింది.