బిగ్ బాస్ రియాలిటీ షోపై దాఖలైన పిటిషన్‌పై సోమవారం (మే 2) ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌ సహా ప్రస్తుతం ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌ షోలో అసభ్యత, అశ్లీలత, హింస పాళ్లు మించుతోందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 2019లోనే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దానిపై సోమవారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ ఎస్‌.సుబ్బారెడ్డితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్‌ తరఫున న్యాయవాది గుండాల శివప్రసాద్‌ రెడ్డి ఇటీవల కోరారు. దానికి అంగీకరించిన ధర్మాసనం సోమవారం విచారణ చేసింది.


ఈ సందర్భంగా రియాల్టీ షోల పేరుతో ఏది పడితే అది ప్రసారం చేస్తామంటూ సహించేది లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇలాంటి వాటి విషయంలో తాము పట్టించుకోకుండా ఉండలేమని పేర్కొంది. రియాల్టీ షోలలో ఒకవైపు హింసను ప్రోత్సహిస్తూ దాన్ని సంస్కృతి అని ఎలా చెబుతారని ధర్మాసనం అడిగింది. ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ అవసరమని భావిస్తే.. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట దీని గురించి అవకాశాన్ని పిటిషనర్‌కు వదిలేసింది.


ఈ అంశంపై సీనియర్‌ న్యాయవాది మాట్లాడుతూ.. ఈ వ్యాజ్యం 2019లో దాఖలైందని తెలిపారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది అత్యవసర విచారణ కోసం 10 రోజుల కిందట హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర బెంచ్‌ ముందు అభ్యర్థించారని తెలిపారు. అయితే, సీజే నేతృత్వంలోని ధర్మాసనం అనుమతించలేదని తెలిపారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది శివప్రసాద్‌ రెడ్డి స్పందిస్తూ సీజే బెంచ్‌ ముందు ప్రస్తావించిన మాట వాస్తవమేనని తెలిపారు. ఇన్‌ఛార్జి కోర్టు ముందు విచారణ కోరే హక్కు పిటిషనర్‌కు ఉందని తెలిపారు. ఆ వాదనలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. సీజే బెంచ్‌ విచారణ జరిపేందుకు నిరాకరించిన విషయాన్ని తమ ముందు నిజాయతీగా ఒప్పుకొని ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. మళ్లీ సీజే బెంచ్‌ వద్ద అత్యవసర విచారణ కోసం అభ్యర్థించే వెసులుబాటును పిటిషనర్‌కు వదిలేసింది.