నూజివీడు: అకాల వర్షాలు కురుస్తున్నందున ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. అకాల వర్షాల కారణంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఆదేశించారు. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం , అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, ఎన్టీఆర్, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సైతం వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు.
ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా నూజివీడు నియోజకవర్గంలో అకాల వర్షం కారంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్టమైన భద్రత చర్యలు, సహాయ సహకార కేంద్రాలు, నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా, మండల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ, పోలీసు, విద్యుత్, మెడికల్, అగ్రికల్చర్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్&బి అధికారులు సమన్వయంతో పని చేసి నష్టనివారణ చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ అంతరాయం, త్రాగునీరు, సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. నూజివీడు నియోజకవర్గంలో హార్టికల్చర్ ,మామిడి పంట నష్ట వివరాలు పూర్తి నివేదిక సమర్పించాలన్నారు.
అవసరం మేరకు మెడికల్ క్యాంపులు, ఏర్పాటు చేయలన్నారు. ఆస్తి, ప్రాణ నష్టం కలుగకుండా పూర్తి భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. రహదారుల అంతరాయం తక్షణమే నివారించాలన్నారు. అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. అకాల వర్షం కారణంగా జిల్లాలో, నూజివీడు నియోజకవర్గంలో మామిడి పంట నష్టం పూర్తి వివరాలు సమర్పించాలని అధికారులకు ఆదేశించారు.
జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేసిన హోం మంత్రి
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. హోంమంత్రి వంగలపూడి అనిత విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తో ఫోన్లో మాట్లాడారు. వర్షాల తాజా పరిస్థితిపై ఆరా తీశారు. పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను హోంమంత్రి అనిత అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చెయ్యాలని అధికారులకు సూచించారు. అవసరమైన మేరకు సహాయక చర్యలు అందించేందుకు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని మంత్రి అనిత ఆదేశించారు. అసలే వేసవి కాలం కావడంతో తాగునీరు, విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలన్నారు.
ఓవైపు వర్షాలు కురుస్తున్నా రాష్ట్రంలో పలు జిల్లాల్లో 41 నుంచి 43 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో బుధవారం వరకు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు.