ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వం ఖండించింది. ఒక్క ఉద్యోగిని కూడా తొలగించే పరిస్థితి లేదని ప్రకటించింది. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోలపై నడుస్తున్న గందరగోళంపై మంత్రి బొత్స స్పందించారు. కావాలనే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద చల్లాలని ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఏ విషయంలో కూడా అస్పష్టత లేకుండా జాగ్రత్త పడుతున్నామని బొత్స పేర్కొన్నారు. ఎవ్వరికీ రాని మెజారిటీ తమకు వచ్చిందని అన్ని వర్గాలకు మంచి పాలన ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఉన్నామన్నారు. కొన్ని శాఖల్లో పని లేని ఔట్ సొర్సింగ్  ఉద్యోగులు ఉంటే వాళ్ళకి మాత్రమే ఇప్పుడు విడుదల చేసిన జీవో వర్తిస్తుందని అన్నారు. దీనిపై అనవసర దుష్ప్రచారం  చెయ్యొద్దని హితవు పలికారు. 


ఈ ప్రచారంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల  రామకృష్ణారెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను  తొలగిస్తున్నామనే ప్రచారం  అవాస్తవమని అన్నారు. ఇలాంటి ఆలోచన ప్రభుత్వానికి రాదన్నారు. శాఖలపరంగా ఏదైనా చర్యలు  ఉంటే తీస్కుంటామే తప్ప వారి జోలికి వెళ్లబోమని చెప్పారు. 


స్కిల్ డెవలప్మెంట్‌లో జరిగింది పెద్ద స్కామ్ అని ఇందులో రాజకీయ ప్రమేయం ఉందని అభిప్రాయపడ్డారు సజ్జల. సెంట్రల్ ఏజెన్సీ  దర్యాప్తు  జరుగుతుందని అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలి  అనే ఉద్దేశ్యంతోనే రాయలసీమ గర్జన జరుగుతోందన్నారు. అమరావతి ఒక్కటే రాజధాని అని బాబు చెప్పడం ఆయన  అహంకారానికి నిదర్శనమన్నారు. రాయలసీమపై చిన్న చూపు మాత్రమేనన్నారు. గతంలో చంద్రబాబు రాయలసీమకు ఏదైనా  ప్రాజెక్ట్  తెచ్చారా అని నిలదీశారు. 


పదేళ్లలోపు వారిని తొలగిస్తున్నారని బీజేపీ ఫైర్


పదేళ్ల లోపు సర్వీసు ఉన్న వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చిందని బిజెపి శాసనమండలి పక్షనేత పివిఎన్ మాధవ్ ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ అమలు మాట దేవుడెరుగు ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పీకేసేందుకు కంకణం కట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నివెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ నిర్ణయం...


గుట్టుచప్పుడు కాకుండా కుట్రపూరిత ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసిందని మాదవ్‌ వ్యాఖ్యానించారు. ఈ మేరకు  ప్రభుత్వం అన్ని శాఖలకు ఉత్తర్వులు పంపినట్లు సమాచారం అందుతుందని ఆయన  పేర్కొన్నారు. పై నుంచి అందిన ఆదేశాల అమలుకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని వివరించారు. 


రాష్ట్ర వ్యాప్తంగా పదేళ్లలోపు సర్వీసు ఉన్న 2.40 మంది ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారని పేర్కొన్నారు. ఏ రోజైనా తమ ఉద్యోగం రెగ్యులర్‌ అవుతుందని ఆశించిన వీరందరూ ఇప్పుడు తమ భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళనలో చిక్కుకున్నారని తెలిపారు. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కష్టాలు తీరుస్తామని జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారని, 'సమాన పనికి- సమాన వేతనం' ప్రాతిపదికన న్యాయం చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విషయాన్ని మాదవ్ గుర్తు చేశారు. అయితే అందుకు భిన్నంగా వైసీపి ప్రభుత్వం  వ్యవహరిస్తోంని మాధవ్  విమర్శించారు.