రైతులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి తప్పుపట్టింది. జులై 31న విద్రోహదినంగా జరపాలని నిర్ణయించింది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశంలో ఈ మేరకు పలు తీర్మానాలు చేసింది.
నల్లమడ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొల్లా రాజమోహన్ అధ్యక్షతన సమన్వయ సమితి సమావేశం విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో జరిగింది. ఈ సమావేశాన్ని రైతు సంఘం సీనియర్ నాయకులు వై కేశవరావు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం సంయుక్త కిసాన్ మోర్చా అడిగిన వివరణ ఇవ్వకుండానే ఏకపక్షంగా 29 మందితో కూడిన పంటల వైవిధ్యాన్ని, ప్రకృతి సేద్యాన్ని పరిశీలించే కమిటీ ఏర్పాటు చేసిందని ఆరోపించింది. ఈ కమిటీయే మద్దతు ధరల గురించి కూడా పరిశీలిస్తుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీ కార్యదర్శిగా మూడు నల్ల చట్టాలను రూపొందించిన మాజీ వ్యవసాయ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ నియమించిందని గుర్తు చేసింది. ఈ కమిటీ ఆసాంతం నల్ల చట్టాలను సమర్థించిన వారితోనూ, బిజెపి అనుమాయులతోనూ నింపేసిందని విమర్శించింది.
గతంలో ఇచ్చిన హామీకి భిన్నంగా విద్యుత్ సవరణ బిల్లు 22ను రూపొందించిందని.. ఆ కమిటీలో చేరబోనని సంయుక్త కిసాన్ మోర్చా నిర్బంధంగా ప్రకటించిందని తెలిపారు. మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తదితర డిమాండ్ల సాధన కోసం పోరాటం సాగించాలని సమావేశం నిర్ణయించింది.
జాతి వ్యతిరేకమైన సైనిక రిక్రూట్మెంట్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకం ద్వారా ప్రవేశపెట్టిందని.. దీని వలన దేశ రక్షణకు, యువత భవిష్యత్తుకు, సైనికుల జీవితాలకు భద్రత ఉండదని అందుకే అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిందీ సమావేశం. ఆగస్టు 7 నుంచి 14 తేదీల మధ్య యువజన, విద్యార్థి, మాజీ సైనిక సంఘాలను కలుపుకొని జిల్లా కేంద్రాల‌్లో సదస్సులు జరపాలని మరో తీర్మానం చేసింది. ఇందులో భాగంగా ఆగష్టు 14 రాత్రి జన జాగరణ కార్యక్రమం జరపాలని, ఆగస్టు 15న గ్రామగ్రామాన జై జవాన్-జై కిసాన్ నినాదంతో జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని సమావేశం నిర్ణయించింది.
పాల ఉత్పత్తులపై విధించిన జి.ఎస్.టి ని ఉపసంహరించుకోవాలని జులై 24న ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరపాలని నిర్ణయించింది. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించ వద్దని జరిగే ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చింది.