ఉద్యోగులు సంతోషంగా ఉంటే డెలివరీ మెకానిజం బాగుంటుందంటూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయ కారణాలతో చెప్పే వాటిని నమ్మవద్దని ఆయన ఉద్యోగులకు సూచించారు.


సీఎం ను కలిసిన ఉద్యోగులు


తాడేపల్లిలోని ముఖ్యమత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం  వైఎస్‌ జగన్‌ను ఆంధ్రప్రదేశ్ జేఏసీ అమరావతితో  సహా పలు ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. కేబినెట్‌ సమావేశంలో ఉద్యోగులకు కొత్తగా జీపీఎస్‌ అమలులోకి తీసుకురావడం, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణ, ప్రభుత్వంలో ఏపీవీవీపీ ఉద్యోగుల విలీనం, పీఆర్సీ ఏర్పాటు సహా ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాల పై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి  ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపాయి.


ఆ మాటలను నమ్మకండి..


ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా 60 రోజుల్లోగా పూర్తిగా అమల్లోకి రావాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఎక్కడా జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. డైలీవేజ్‌ కేటగిరీ ఉద్యోగులను కూడా ఆప్కాస్‌ పరిధిలోకి తీసుకుని రావాలని  ఈ సందర్బంగా అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. ఉద్యోగులంతా సంతోషంగా ఉంటే డెలివరీ మెకానిజం బాగుంటుందని, ప్రజలు సంతోషంగా ఉంటారని జగన్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగులను  సంతోషంగా ఉంచడానికి ప్రతి కార్యక్రమం కూడా మనసా, వాచా, కర్మణా చిత్తశుద్ధితో అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఎప్పుడూ ఉద్యోగులు తమ దృష్టిలో ఉంచుకోవాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచించారు.


రాజకీయాతో చూడకండి..


ఎవరైనా  రాజకీయ కారణాలతో ఏదైనా చెప్పినా ఉద్యోగులు వాటిని విశ్వసించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తాను మనస్పూర్తిగా ఉద్యోగుల గురించి ఆలోచించటంతో పాటుగా, మంచి చేయడం కోసమే పని చేస్తానని హమీ ఇచ్చారు. త్వరలోనే అన్నింటినీ పరిష్కరిస్తున్నామని తెలిపారు. చరిత్రలో తొలిసారి, తమ  ప్రభుత్వం సమస్యలను సమస్యలుగా వదిలేయకుండా, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం చూపాలని ప్రయత్నిస్తున్నామని అన్నారు. దీని వలన ఉద్యోగులకు సైతం మంచి జరగాలని జగన్ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి జరగాలని ఆలోచన చేశామని, జీపీఎస్‌ కోసం దాదాపు రెండు సంవత్సరాలు కసరత్తు చేసినట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.  ఉభయ ప్రయోజకరంగా ఉండే విధంగా జీపీఎస్‌ను  రూపొందించామని జగన్ ఉద్యోగులకు వివరించారు.


భవిష్యత్‌ తరంలో వచ్చే ఉద్యోగుల్లో సైతం ఆ రోజు జగన్‌ ఉద్యోగులకు మంచి చేశాడని చెప్పుకునే విధంగా తన విధానాలు ఉంటాయని సీఎం భరోసా ఇచ్చారు. అంతే కాదు ఉద్యోగులకు మంచి చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి సైతం ముఖ్యమంత్రి హోదాలో జగన్ బాధ్యతగా పని చేశారనే అభిప్రాయం కూడా కల్పించాల్సిన భాద్యత తన పై ఉందని అన్నారు. ఉద్యోగులు రోడ్డు మీదకు రాకూడనే ఉద్దేశ్యంతో మంచి ఆలోచన చేశామని, జీతం బేసిక్‌లో కనీసం 50 శాతం పెన్షన్‌గా వచ్చేట్టు ఏర్పాటు చేశామని తెలిపారు.  ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణలోకి తీసుకుని డీఆర్‌లు జీపీఎస్‌లో ఇస్తున్నామని,రిటైర్ అయిన ఉద్యోగుల జీవన ప్రమాణాలు స్ధిరంగా మెయింటైన్‌ కావడానికి తగినట్టుగా గ్యారంటీ పెన్షన్‌ స్కీంను తీసుకువచ్చామన్నారు.