Employes Agitations: ప్రభుత్వంతో చర్చలు విఫలమైనందున ఉద్యమాన్ని కొనసాగించాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఈనెల 27న తలపెట్టిన చలో విజయవాడ(Vijayawada) కార్యక్రమంల యథాతథంగా కొనసాగుతుందని ఉద్యోగ సంఘం నేతలు స్పష్టం చేశారు. గత సమావేశాల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ ప్రభుత్వం నెరవేర్చలేదని ఉద్యోగ సంఘ నేతలు మండిపడ్డారు. మధ్యంతర భృతి(I.R) ప్రకటించాలని అడుగుతుంటే జులైలో పీర్సీ(PRC) అమలు చేస్తామని తప్పించుకునేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల డిమాండ్ల విషయంలో ప్రభుత్వం నుంచి ఏమైనా పురోగతి కనిపిస్తే..అప్పుడు మరోసారి రాష్ట్ర కార్యవర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని లేకపోతే గతంలో ప్రకటించిన ఉద్యమ కార్యాచరణ యథాతథంగా ఉంటుందని ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు..
ఉద్యోగుల పోరుబాట
డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఉద్యమ పోరు నుంచి వెనక్కి తగ్గేది లేదని ఏపీ ఉద్యోగులు స్పష్టం చేశారు. మంత్రుల కమిటీతో జరిపిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేనందున ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తామని ఉద్యోగ సంఘ నేతలు బండి శ్రీనివాసరావు(Bandi Srinivasarao), బొప్పరాజు వెంకటేశ్వర్లు(Bopparaju Venkateswarlu) తెలిపారు. సంప్రదాయం ప్రకారం పీఆర్సీ నియమించినప్పుడు అది అమలయ్యే వరకు మధ్యంతర భృతి(I.R) ఇవ్వడం ఆనవాయితీ అని దాన్ని ప్రకటించాలని కోరితే జులై 31 లోపు పీఆర్సీ సెటిల్ చేస్తామని చెబుతోందన్నారు. పెండింగ్ బకాయిలే ఇవ్వలేని ప్రభుత్వం....14వేల 800కోట్ల పీఆర్సీ అరియర్స్ ఎక్కడ నుంచి తీసుకొచ్చి ఇస్తుందని ఉద్యోగ సంఘాలు ప్రశ్నించాయి. అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ , గత పీఆర్సీ అరియర్ లు, ఉద్యోగ విరమణ చేసిన వారికి చెల్లింపులు పై స్పష్టత ఇస్తామని గత సమావేశంలో మంత్రుల కమిటీ చెప్పింది. కానీ ఇప్పటికీ వాటిపై స్పష్టత ఇవ్వలేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. తాము చేసిన డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పిందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దకరణకు సంబంధించి ప్రభుత్వం ఇంకా ఇబ్బందులు పెడుతోందన్నారు. 10 వేల మందిని రెగ్యులర్ చేస్తామని చెప్పి ఇప్పటికీ 1300 మందిని మాత్రమే చేశారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు(Bopparjau) మండిపడ్డారు. గత సమావేశంలో చెప్పిన వాటిని ప్రభుత్వం ఇంకా నెరవేర్చాల్సి ఉందని ఏపీ జేసీసీ(AP JAC) అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. 30శాతం ఐఆర్ ప్రకటించాలని కోరితే...ప్రభుత్వం మాత్రం జూన్ నెలాఖరు కల్లా మొత్త పీఆర్సీ ఇస్తామని చెప్పిందన్నారు. పీఆర్సీ అరియర్స్ పైనా క్లారిటీ ఇవ్వలేదన్నారు.
పెండింగ్ బకాయిలు చెల్లుంపు, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం చెబుతున్న దానికి, చేస్తున్నదానికి ఎక్కడా పొంతన కుదరడం లేదన్నారు.
ప్రభుత్వం వాదన
ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana)తెలిపారు. మార్చి నెలాఖరు కల్లా బకాయిల చెల్లింపు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పీఆర్సీని పూర్తిస్థాయిలో ప్రకటించనున్నందున ఐఆర్ గురించి ఆలోంచాల్సిన అవసరం లేదన్నారు. క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పై వచ్చిన వినతిపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ నెల 27 చలో విజయవాడ ను విరమించుకోమని ఉద్యోగ సంఘ నేతలను కోరామని....వారి నుంచి సానుకూల నిర్ణయమే వస్తుందని ఆశిస్తున్నామన్నారు.