AP Editors Association complaint about Punganur Incident: పుంగనూరు లో చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసుల పై దాడి, చెలరేగిన హింసాకాండ పై ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. సంఘటన కు కారకులైన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పై చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.


అందుకు చంద్రబాబే కారణం...
పుంగనూరు ఘటన కు కారకుడు అయిన చంద్రబాబు పై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ జాతీయ మానవ హక్కుల కమీషన్ కు రాసిన లేఖలో పేర్కొంది.  ఈ మేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు చేసిన ఫిర్యాదు వివరాలను ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణంరాజు మీడియాకు విడుదల చేశారు. ఆగస్టు 4వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కారణంగా జరిగిన భయంకరమైన, ఉద్దేశపూర్వక హింసాత్మక చర్యగా పుంగనూరు వ్యవహరం ఉందని ఆయన అన్నారు.  సంఘటన మానవ హక్కులపై తీవ్రమైన దాడిని సూచిస్తుందని, తక్షణం చర్య తీసుకోవాలని కోరారు. సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించేందుకు తాను పర్యటిస్తున్నానని చంద్రబాబు చెబుతూనే, అమాయక పౌరులు, రైతుల పై దాడి చేయడానికి తన అనుచరులను క్రూరంగా ప్రేరేపించినట్లుగా ఉందని తెలిపారు. అంతే కాదు విధిగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది పై దాడి చేయటం దారుణమని పేర్కొన్నారు.


చంద్రబాబు ముందుగా అనుమతి తీసుకున్న రూట్ ను కాదని, వేరొక రూట్ లో పుంగనూరులోకి ఎంట్రీ ఇవ్వటం వెనుక కుట్ర దాగి ఉందనే అనుమానం వ్యక్తం చేశారు.  జాతీయ రహాదారిని చంద్రబాబు తన అనుచరులతో కావాలనే బ్లాక్ చేశారని ఆ తరువాత  పోలీసులను తరిమికొట్టాలని తన అనుచరులను బహిరంగంగా ప్రేరేపించారని లేఖలో పేర్కొన్నారు. దీంతో చంద్రబాబు కు చెందిన సైన్యం,   హింసాత్మకంగా మారారని,  వందలాది రాళ్లు రువ్వవటంతో పాటుగా పోలీసు వాహనాలను తగులబెట్టారని తెలిపారు.


చంద్రబాబు అనుచరుల వద్ద అక్రమ ఆయుధాలు...
చంద్రబాబు నిర్వహించిన ర్యాలీలో ఆయన అనుచరులు కొందరు అక్రమంగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని తీసుకొచ్చారని, పోలీసులు సైతం  కొన్ని తుపాకులను, బులెట్లను స్వాధీనం చేసుకున్నారని లేఖలో తెలిపారు.  ఈ సంఘటనలో ఉద్దేశపూర్వకంగానే క్రూరత్వం ప్రదర్శించి పోలీసులు, ప్రభుత్వ అధికారులతో పాటుగా రైతులు, సాధారణ ప్రజల ప్రాణాలకు కూడ ముప్పు కలిగేలా వ్యవహరించారని, ఈ విషయాలు పై తగిన విచారణ జరిపించాలన్నారు.


లారీ అడ్డుపెట్టింది వైసీపీనే... టీడీపీ మండిపాటు..
చంద్రబాబు పర్యటనకు లారీ అడ్డం పెట్టి అడ్డుకుంది ఎవరో తేల్చాలని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. అడ్డుగా ఉన్న లారీని పక్కకు తీస్తుంటే టిడిపి కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. రోడ్డుకు లారీ అడ్డం పెట్టిన వారిని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. పద్నాలుగేళ్లు సిఎంగా ఉన్న చంద్రబాబు ను అడ్డుకుంటే  పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి  ఆధ్వర్యంలో పోలీసు అధికారులు పని‌చేశారని ఆరోపించారు. చంద్రబాబు మీదకు వస్తే చూస్తూ ఊరుకోవాలా అని మండిపడ్డారు.  ఘటనలో పోలీసులు  గాయపడటం బాధాకరమని, అయితే  జిల్లా ఎస్పీ వైసిపి నాయకుడిలా మాట్లాడుతున్నారని ఖండించారు. 
పోలీసు అధికారుల సంఘానికి టిడిపి నాయకులే గుర్తు వస్తారా అని ప్రశ్నించారు. మీ అధికారులను బూతులు తిట్టిన మంత్రులు‌ను ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.