బాపట్ల: ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్న పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారని, ఎప్పుడూ ప్రజల మధ్యకు రారు, కానీ ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని సిద్ధం అంటూ బయటకు వచ్చారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాపట్ల నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో పాల్గొన్న షర్మిల సోదరుడు, ఏపీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు.  మీరు దేనికి సిద్ధం జగన్ సార్..? మళ్ళీ 8 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా ? లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టి.. బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా ? ప్రత్యేక హోదా ను మళ్ళీ బీజేపీ దగ్గర తాకట్టు పెట్టడానికి సిద్ధమా అని నిలదీశారు.


ప్రత్యేక హోదాపై చేతులెత్తేసిన జగన్ 
పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేయడానికి సిద్ధమా, 25 లక్షల ఇండ్లు కడతామని మోసం చేయడానికి సిద్ధమా.. లేక రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ మాఫియాకు సిద్ధమా అంటూ జగన్ పై మండిపడ్డారు. ఒకవేళ వీటికి మీరు సిద్ధమైతే... ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం అంటూ అన్న జగన్ పై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సెటైర్లు వేశారు. ప్రత్యేక హోదా పై ఏపీ సీఎం జగన్ చేతులు ఎత్తేశారని, బీజేపీ కి పూర్తి మెజారిటీ వస్తుందని, ఏమీ చేయలేమని అంటున్నారని గుర్తు చేశారు. రాష్ట్రానికి రాజధాని లేదని, పోలవరం ఇవ్వలేదని.. ఎందుకు ఇన్నాళ్లు కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేదని సోదరుడు జగన్‌ను వైఎస్ షర్మిల ప్రశ్నించారు. 


పోలవరం వచ్చేంత వరకు, హోదా సాధించే వరకు కొట్లడుతా అన్నారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలో వస్తే ఏపీకి ప్రత్యేక హోదా రాదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబుకు ఓటు వేసినా, జగన్ కు ఓటు వేసినా అది బీజేపీ ఖాతాలోకే వెళ్తుందని ప్రజలు గుర్తించాలన్నారు. రాష్ట్రంలో ఒక్క సీటు గెలవక పోయినా బీజేపీ రాజ్యమేలుతుందంటూ మండిపడ్డారు. హోదా రావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం, అధికారంలో వచ్చిన మొదటి రోజే హోదా పై సంతకం పెడతా అని రాహుల్ హామీ ఇచ్చారని షర్మిల గుర్తుచేశారు. రాజధాని రావాలంటే, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే కాంగ్రెస్ రావాలని షర్మిల వ్యాఖ్యానించారు.


వచ్చే దారిలో బాపట్ల ఎలా ఉందని ఓ అన్నని అడిగితే... వైఎస్సార్ హయాంలో 14 వందల కోట్లతో చేసిన అభివృద్ధి తప్పా, మరేం లేదన్నారు. చంద్రబాబు, జగన్ కూడా చేసిందేమీ లేదన్నారు. రోడ్లు వేయలేదని, కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని ఆ వ్యక్తి చెప్పినట్లు షర్మిల తెలిపారు. ఎమ్మెల్యే, ఎంపీలు ఇసుక మాఫియా మీద ప్రేమ తప్పా మరొకటి లేదన్నారు. 


వైఎస్సార్ ఆశయాలను మరిచారంటూ షర్మిల మండిపాటు 
వైఎస్సార్ గుర్తుతో గెలిచారు. కానీ గెలిచాక వైఎస్సార్ ఆశయాలను మరిచారని వైసీపీ నేతలపై మండిపడ్డారు. కనీసం వైఎస్సార్ విగ్రహాన్ని కూడా పెట్టనివ్వడం లేదని కొన్నిచోట్ల నేతలు వాపోతున్నారని షర్మిల ప్రస్తావించారు. వైఎస్సార్ హయాంలో వ్యవసాయం ఒక పండుగ, రైతే రాజు అని.. సబ్సిడీ పథకాలతో రైతును ఆదుకున్నాడని పేర్కొన్నారు. ఇప్పుడున్న జగన్ అన్న ప్రభుత్వం.. కనీసం పంట నష్ట పరిహారం కూడా ఇవ్వలేని దిక్కుమాలిన ప్రభుత్వమంటూ నిప్పులు చెరిగారు. రైతుకు పరిహారం లేదు.. కనీసం భీమా కూడా లేదు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా లేదు, మరోవైపు జాబ్ క్యాలెండర్ అని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. 


‘ప్రత్యేక హోదా రాలేదు కానీ ప్రత్యేక హోదా పేరుతో మందు బాటిల్ వచ్చింది. యదేచ్ఛగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఆన్ లైన్ సేల్స్ లేవు...అంతా క్యాష్ పేమెంట్ అంట. రాష్ట్రానికి వచ్చే ఆదాయం దొచేస్తున్నారు. ఈ 10 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. మనకు ప్రత్యేక హోదా వచ్చి ఉంటే... రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. ఈ 10 ఏళ్లలో పార్టీలు కనీసం ఒక్క ఉద్యమం చేసింది లేదు. హోదా వచ్చి ఉంటే పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చేవి. మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి. బీజేపీ తిరుపతి సభలో 10 ఏళ్లు హోదా ఇస్తామని హామీ ఇచ్చినా మాట తప్పింది. చంద్రబాబు 15 ఏళ్లు అడిగారు. జగనన్న ఎంపీలు గెలిస్తే హోదా ఎందుకు రాదో చూద్దామన్నారు. ఇద్దరూ అధికారం అనుభవించారు తప్పా, రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసిందేమీ లేదు. 8 లక్షల కోట్లు అప్పులు తెచ్చినా.. రోడ్లు వేయడానికి డబ్బు లేదు. రాజధాని కట్టడానికి డబ్బులు లేవని’ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.