పల్నాడు జిల్లా క్రోసురులో విద్యాకనుక కిట్ పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం జగన్... చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుది పెద్దందారీ మనస్తత్వం, వారిది పేదల వ్యతిరేక ఆలోచనలు ఉంటాయన్నారు. పేద పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు కనిపిస్తే చూడలేని వ్యక్తి చంద్రబాబు అన్నారు. వారికి ఇంగ్లీష్ మీడియం చదువులు లభించకూడదని చూసే వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు.
నాలుగేళ్లలో తమ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు చంద్రబాబు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు జగన్. దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం చేయని విధంగా మహిళలకు తోడుగా నిలబడ్డామన్నారు. మరి గతంలో చంద్రబాబు మహిళలకు ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం తర్వాత మోసం చేశారన్నారు. రైతులకు, యువతకు, ఎస్సీ, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, ఓసీల్లోని నిరుపేదలను అందర్నీ మోసం చేశారన్నారు.
చంద్రబాబు బతుకే మోసం అన్నారు. చంద్రబాబు బతుకే పెద్ద అబద్దమన్నారు జగన్. చంద్రబాబుది పెద్దందారి మనస్తత్వం, ఈ బాబు పేదలకు వ్యతిరేకం అని మర్చిపోవద్దన్నారు. పద్నాలుగు ఏళ్లు సీఎం పోస్టులో ఉండి కూడా చంద్రబాబు పేరు చెబితే ఓ ఒక్క సంక్షేమ పథకం, మంచి గుర్తుకురాదన్నారు. వెన్నుపోట్లు, మోసం, కుట్ర, దగా మాత్రమే గుర్తుకు వస్తాయన్నారు. ఇన్ని విషయాల్లో ఇంత దారుణంగా ప్రజలను మోసం చేస్తున్నా.. అన్ని విషయాల్లో బాబును వెనుకోసుకు రావడానికి ఓ వర్గం మీడియా, దత్తపుత్రుడు మాత్రమే తోడుగా ఉన్నారు. బాబు పాలన వల్ల తమకు మేలు జరిగిందని... ఓ ప్రాంతంగానీ, సామాజిక వర్గం కానీ, పేదలు కానీ ఆయనకు తోడుగా లేరని అన్నారు. ఈ మూసేయడానికి టీడీపీ దుకాణంలో పక్క రాష్ట్రాల్లోని మేనిఫెస్టోలు తీసుకొస్తున్నారు. తమ ప్రభుత్వం అమలు చేసి చూపించిన పథకాలను కిచిడీ చేసి పులిహోరా తీసుకొస్తున్నారు.
ఇన్నేళ్ల తర్వాత రాయలసీమ డిక్లరేషన్ పేరుతో మళ్లీ ప్రజలక ముందుకు వెళ్తున్నారు. పద్నాలుగేళ్లు ఏం గాడుదులు కాశారని ప్రశ్నించారు. ఇప్పుడు మళ్లీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ డిక్లరేషన్ అంటూ ఇప్పుడు మొదలు పెట్టారు. ఇవాళ ప్రజలను మోసం చేస్తూ మరోసారి అధికారం ఇస్తే మయసభను నిర్మిస్తామంటున్నారు. ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తామంటున్నారు. ఇంటింటికీ బెంజి కారు కూడా ఇస్తామన్నారు. ఈ కొత్త డ్రామాలు నమ్మొచ్చా అని అడుగుతున్నాను అన్నారు. కనీసం ఇప్పటికైనా చంద్రబాబు మరోసారి మోసానికి తెరతీయడం ఆపేస్తారని ఆశిద్దామన్నారు. వాగ్దనాలు, మోసం చేయడమే చంద్రబాబు సైకిల్ చక్రమన్నారు. పేదల ప్రభుత్వానికి బాబు పెద్దందారీ మనస్తత్వానికి మధ్య యుద్ధం అన్నారు.
బీజేపీపై ఒకే ఒక్క మాట
చంద్రబాబును టార్గెట్ చేసుకున్న జగన్... బీజేపీపై ఒకే మాట మాట్లాడారు. చంద్రబాబుకు మాదిరిగా బీజేపీ తనకు అండగా ఉండకపోవచ్చు అన్నారు.