ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఎప్పుడూ ఫ్యాంటు, షర్టులో కనిపించే సీఎం నేడు ఉగాది సందర్భంగా సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు. అచ్చ తెలుగుదనం ఉట్టిపడేలా తెలుపు రంగు పంచె, తెలుపు చొక్కా, పైపంచె ధరించి కనిపించారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలోని గోశాలలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు ప్రజల సంప్రదాయం, ఆచారాలు ఉట్టి పడే విధంగా ఉగాది సంబరాలు జరిగాయి. విఘ్నేశ్వర ఆలయంలో పూజతో కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా నూతన పంచాగాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం పంచాంగ శ్రవణంలో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు.
తిరుమల ఆనందనిలయం తరహాలో ఆలయ నమూనాల సెట్టింగులను అక్కడ ఏర్పాటు చేశారు. మండలంలోని గోడలకు దశావతారాల బొమ్మలు ఆకట్టుకున్నాయి. మొత్తానికి తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు పరిఢవిల్లేలా సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు.
కప్పగంతు సోమయాజి పంచాంగ శ్రవణం
అనంతరం పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. కప్పగంతు సుబ్బరామ సోమయాజి పంచాంగ శ్రవణం చేశారు. శ్రీశోభకృత్ నామ సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయని కప్పగంతు సుబ్బరామ సోమయాజి అన్నారు. ఉద్యోగులు, శ్రామికులు, రైతులకు, కార్మికులకు మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. పాడి పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఉంటుందని, ఆహార ఉత్పతులతో ముడిపడిన వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. పంచాంగ పఠనం అనంతరం కప్పగంతు సుబ్బరామ సోమయాజిని సీఎం జగన్ సత్కరించారు.
ప్రజలకు సీఎం జగన్ శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ సీఎం జగన్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో అన్ని శుభాలు జరగాలని సీఎం జగన్ కోరుకుంటున్నానని అన్నారు. రైతులకు వర్షాలు కురిసి మేలు జరగాలని ఆకాంక్షించారు. అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతలు, సకల వృత్తుల వారు సంతోషంగా ఉండాలని, రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని సీఎం జగన్ ఈ సందర్భంగా మాట్లాడారు.
తిరుమల ఆలయం, విజయవాడ కనకదుర్గ ఆలయం నుంచి వచ్చిన పండితులు.. సీఎం జగన్ దంపతులకు వేద ఆశీర్వచనం ఇచ్చారు. సీఎం జగన్ దంపతులకు మంత్రి ఆర్కే రోజా మెమెంటో అందజేశారు. సాంస్కృతిక శాఖ రూపొందించిన క్యాలెండర్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను సీఎం జగన్ దంపతులు వీక్షించారు.
సీఎం జగన్ ట్వీట్
షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమయ్యే ఉగాది.. తెలుగు లోగిళ్లలో నూతన సంవత్సర శోభను తెస్తూ, కొత్త లక్ష్యాలకు, కొత్త ఆలోచనలకు నాంది కావాలని ఏపీ సీఎం జగన్ ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి ఉజ్వల భవిష్యత్తుకు, తద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడాలని అన్నారు. అలాగే శోభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు జరగాలని, సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని ముఖ్యమంత్రి అభిలషించారు. అంతేకాకండా శోభకృత్ నామ సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని ఆకాంక్షించారు.