CM Chandrababu: 43 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం, కార్యకర్తలకు జన్మంతా రుణపడి ఉంటాను: చంద్రబాబు
TDP Foundation Day | దేశంలో సంక్షేమ యుగాన్ని తీసుకొచ్చింది ఎన్టీఆర్ అని, ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ ముందుకెళ్లారని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పసుపు జెండా అంటే ఒక స్ఫూర్తి అన్నారు.

TDP Formation Day | అమరావతి: తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీకి మద్దతుగా నిలుస్తున్న ప్రజానికానికి, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. వివిధ వర్గాల ప్రజలు రకరకాల పండుగలు జరుపుకుంటారు. కానీ అన్నివర్గాల వారు జరుపుకునే పండుగ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం అని పేర్కొన్నారు.
60 వేల మంది టీడీపీ కార్యకర్తలు, నాయకులతో చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. 43 ఏళ్ల ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం, కార్యకర్తలకు జన్మంతా రుణపడి ఉంటాను. పార్టీ కుటుంబ పెద్దగా అండగా ఉంటా అన్నారు. తెలుగుదేశం పార్టీ బలోపేతం అవ్వడం అంటే రాష్ట్రానికి మంచి జరగడమేనని చంద్రబాబు అన్నారు.
కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..
- తెలుగుదేశం పార్టీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. నాలుగు దశాబ్దాలుగా పార్టీతో నడుస్తున్న నాయకులు, కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.
- ఏ పార్టీకి లేనటువంటి సిద్ధాంతాలతో మనం ముందుకెళ్తున్నాం. పదవులు, అధికారం కోసం కాకుండా తెలుగుజాతిని అన్ని విధాలా మందుంచాలన్న లక్ష్యంతో ప్రజలే ముందు అనే విధంగా పని చేస్తున్నాం.
- తెలుగుదేశం పార్టీ ప్రజల కష్టాల నుంచి ఆవిర్భవించింది. ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ ముందుకెళ్లారు. నేను ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచాను. రోజురోజుకూ టీడీపీ బలోపేతమవడానికి కార్యకర్తలే కారణం.
- పసుపు జెండా అంటే ఒక స్ఫూర్తి. టీడీపీ ఆవిర్భావం ముందు, ఆ తర్వాత అన్న విధంగా తెలుగుజాతిని చూడాలి.
- సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చి వెనకబడిన వర్గాలకు అండగా నిలబడ్డాం.
- ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పేదలకు రూ.2లకే కిలో బియ్యం, పెన్షన్, జనాతా వస్త్రాలు, పక్కా ఇల్లు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు.
- దేశంలో సంక్షేమ యుగాన్ని తీసుకొచ్చింది ఎన్టీఆరే.
- తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీ వ్యవస్థను నిర్మూలించడంతో పాటు మహిళలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, ఆస్తిలో వాటా హక్కు కల్పించింది టీడీపీ.
- టెక్నాలజీని అందిపుచ్చుకుని అవకాశాలు సృష్టించాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం.
- తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీగా ఉండి జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించింది. ఇది మన తెలుగుజాతికి గర్వకారణం.
- 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, సవాళ్లను ధీటుగా ఎదుర్కొని నిలబడ్డామంటే దీనికి కార్యకర్తల త్యాగాలు, పోరాటేలా కారణం.
- 2019 తర్వాత దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు, బెదిరిపుంలు, అరెస్టులు వంటి చర్యలతో భయోత్పాతం సృష్టించిన కార్యకర్తలు జెండా వదల్లేదు.
- గొంతుపై కత్తిపెట్టి చంపుతామన్నా జై తెలుగుదేశం అని ప్రాణాలు వదిలారంటే...అలాంటి కార్యకర్తలు ఉండటం పార్టీకే గర్వకారణం.
- 43 ఏళ్ల చరిత్రలో ఎంతో మంది నాయకులను పోగొట్టుకున్నాం. పరిటాల రవి, ఎర్రన్నాయుడు, లాల్ జాన్ బాషా, బాలయోగి, కోడెల శివప్రసాద్ లాంటి గొప్ప నాయకులను కోల్పోయాం.
ఈసారి కడపలో మహానాడు, చంద్రబాబు ప్రకటన
- త్యాగాలు, పోరాటాలు టీడీపీకి కొత్తకాదు. ఏం చేసినా రాష్ట్రం కోసం, ప్రజల అభివృద్ధి కోసమే పార్టీ కేడర్ నిలబడ్డారు.
- ఈసారి మహానాడును కడపలో నిర్వహించబోతున్నాం.
- పేదలకు అండగా నిలవాలని ఎన్టీఆర్ ఎప్పుడూ అంటుండేవారు. ఆ ఆశయ సాధనలో భాగంగానే పీ4 కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.
- ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఆర్థికంగా బాగున్నవారు అట్టడుగున ఉన్నవారికి సహకారం అందించి పైకి తీసుకురావడం.
- కోటి సభ్యత్వాలు అనేది అసాధారణ రికార్డ్. పార్టీ సభ్యత్వం ద్వారా రూ.5 లక్షల ప్రమాద బీమా ద్వారా కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలుస్తున్నాం.
- కార్యకర్తలకు ఆవిర్భావ శుభాకాకంక్షలు తెలపడమే కాదు.. వారికి జన్మంతా రుణపడి ఉంటాను.
- పార్టీ కుటుంబ పెద్దగా అండగా ఉంటా. కార్యకర్తలే టీడీపీకి శ్రీరామరక్ష. తెలుగుదేశం బలోపేతం అవ్వడం అంటే రాష్ట్రానికి మంచి జరగడమే అన్నారు.