Amaravati 2.0: ఉగ్రవాదాన్ని భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆంధ్రప్రదేశ్‌ అండగా ఉంటుందని చెప్పారు. ఈ విషయాన్ని హిందీలో చెప్పారు. "ప్రధానమంత్రి మోదీని ఎప్పుడు కలిసినా ఓ జోష్‌ ఉంటుంది. కానీ మొన్న వెళ్లి కలిస్తే చాలా గంభీరంగా ఉన్నారు. అంతకు ముందు రోజే జరిగిన ఉగ్రవాదుల దాడితో ఆయన అలాఉన్నారని అర్థమైంది. ఇలాంటి దాడులు చేసిన వారిని కచ్చితంగా తుదముట్టించాల్సిందే. అందుకే ఈ సభ సాక్షిగా మాట ఇస్తున్నాం. ఉగ్రవాదం భరతం పట్టే క్రమంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అండగా ఉంటాం. తమ రాష్ట్రమే కాదు యావత్ దేశం అండగా ఉంటుంది. మన మనో స్థైర్యాన్ని ఇలాంటి ఉగ్రదాడులు దెబ్బతీయలేవు" అని చంద్రబాబు అన్నారు. 

రక్తం మరిగిపోతుంది: పవన్ 

అంతకు ముందు మాట్లాడిన పవన్ కల్యాణ్ కూడా పహల్గామ్‌ గురించి ప్రస్తావించారు. చాలా క్లిష్ట సమయంలో ప్రధానమంత్రి మోదీ అమరావతి సభకు వచ్చారని అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు దేశం అండగా నిలబడాలని అభిప్రాయపడ్డారు. ఆ దుర్ఘటన తలచుకుంటే యావత్ దేశం రక్తం మరిగిపోతుందని అన్నారు. కచ్చితంగా ఇంతకింత చెల్లించాల్సిందేనన్నారు. పాకిస్థాన్‌కు గుణపాటం చెప్పాలని సూచించారు. అందుకు యావత్ దేశం మోదీకి అండగా ఉంటారని తెలిపారు. 

వరల్డ్ మ్యాప్‌లో పాక్ లేకుండా పోతుంది: లోకేష్ఐటీ మినిస్టర్ నారా లోకేష్ కూడా పవర్‌ఫుల్ స్పీచ్‌తో ఆకట్టుకున్నారు. ప్రపంచ పటంలో కచ్చితంగా పాకిస్థాన్ లేకుండా పోతుందని అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ గీత దాటిందని అన్నారు. అమాయకుల్ని చంపి పెద్ద తప్పే చేసిందని తెలిపారు. ఒక్క పాకిస్థాన్ కాదు, వంద పాకిస్థాన్లు వచ్చినా భారత్‌ నేలపై మొలిచిన గడ్డిని కూడా పీకలేరని అన్నారు. వంద పాకిస్తాన్లకు సమాధానం చెప్పే మిసైల్ మోదీ మన దగ్గర ఉన్నారని అన్నారు. సింహం ముందు ఆటలు ఆడకూడదని ఒకసారి దెబ్బకొడితే వరల్డ్ మ్యాప్‌లో పాకిస్థాన్ పేరు లేకుండా పోతుందన్నారు. మోదీ దెబ్బకు పాకిస్థాన్ ఆర్మీలో పనిచేసే వారంతా సెలవులు పెట్టి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. నమో కొట్టే దెబ్బకి పాక్ దిమ్మతిరగడం ఖాయమని.. సమాధానం ఇవ్వడానికి దేశం మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అండగా నిలుస్తుందన్నారు. పహాల్గామ్ ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారికి ఘన నివాళి అర్పించారు లోకేష్‌.