అమరావతి: వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షల్లో చోటుచేసుకున్న తీవ్ర అక్రమాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చివరకు గ్రూప్-1 స్థాయి అధికారులను ఎంపిక చేసే ఎగ్జామ్ పేపర్లను ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, ప్లంబర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించి, అభ్యర్థుల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన వ్యవస్థను పునరుద్ధరిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 344 నిబంధన కింద జరిగిన ప్రత్యేక చర్చలో భాగంగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం అత్యంత పారదర్శకంగా పనిచేయాల్సిన ఏపీపీఎస్సీని గత పాలకులు నిర్వీర్యం చేశారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులకు ఎంతో కీలకమైన గ్రూప్-1 అధికారులను ఎంపిక చేసే ఈ వ్యవస్థలో, అభ్యర్థులు రాత్రింబవళ్లు శ్రమించి ఉద్యోగాలు సాధించడానికి ప్రయత్నిస్తే, వారి భవిష్యత్తుతో బరితెగించి ఆడుకున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ అనేది ప్రజలకు జవాబుదారీతనంతో విషయాలు వెల్లడించే ప్రాథమిక వేదిక కాబట్టి, ఈ విధ్వంసాన్ని ప్రజా క్షేత్రంలో స్పష్టంగా ఉంచాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసం ప్రారంభం..
2019 నుండి 2024 మధ్య కాలంలో ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన విధ్వంసం రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను మాత్రమే కాకుండా, ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని సైతం పూర్తిగా దెబ్బతీసిందని సీఎం విమర్శించారు. 2018లో విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌కు దాదాపు 1.14 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 325 మందిని షార్ట్‌లిస్ట్ చేయడం జరిగింది. సాధారణంగా పదో తరగతి పరీక్ష పత్రాలను కూడా పోలీసు ఎస్కార్ట్‌తో అత్యంత భద్రంగా తరలిస్తుంటే, రాష్ట్రాన్ని పాలించే ఉన్నతాధికారుల ఎంపిక పరీక్ష విషయంలో అన్ని నిబంధనలను గాలికి వదిలేసి తీవ్ర అవకతవకలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
హైకోర్టు డిజిటల్ మూల్యాంకనాన్ని పక్కన పెట్టి మాన్యువల్ మూల్యాంకనం చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, కోర్టును తప్పుదోవ పట్టిస్తూ అసత్య అఫిడవిట్లు సమర్పించారని దుయ్యబట్టారు. న్యాయస్థానం ఉత్తర్వుల తర్వాత అయినా పరిస్థితిని సరిదిద్దాల్సింది పోయి, మరొక కేసులో సీఐడీ స్వాధీనంలో ఉన్న 'హాయ్ లాండ్' కేంద్రంగా మాన్యువల్ ఎవాల్యుయేషన్ నిర్వహించేందుకు రూ.1.19 కోట్లకు జీవో జారీ చేశారని వెల్లడించారు. పబ్లిక్ సర్వీసు కమిషన్ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి, ప్రైవేటు వ్యక్తులకు పేపర్ వాల్యుయేషన్ బాధ్యతలను అప్పగించారని ధ్వజమెత్తారు.
గ్రూప్ 1 సిట్ రిపోర్టుతో వైసీపీకి చిక్కులు తప్పవా..గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 నియామకాల మూల్యాంకన అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కోర్టుకు సమర్పించిన నివేదిక వైఎస్ఆర్‌సీపీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల వాల్యూయేషన్‌లో నిబంధనల ఉల్లంఘన, సీసీటీవీల తొలగింపు, ప్రైవేటు వ్యక్తులతో వ్యాల్యుయేషన్, OMR స్లిప్పుల రీ-ప్రింటింగ్ వంటి విస్తుగొలిపే నిజాలు ఫోరెన్సిక్ ఆధారాలతో సహా లభించాయి.
నిర్దిష్ట అభ్యర్థులకు ప్రయోజనం చేకూర్చేందుకే ప్లాన్ ప్రకారం ఇదంతా జరిగిందని సిట్ నిర్ధారించింది. నాటి ఏపీపీఎస్సీ కార్యదర్శి, ఉన్నతాధికారుల నిర్ణయాలపై విచారణ సాగినప్పటికీ, రాజకీయ నాయకుల మద్దతు లేకుండా ఈ స్థాయిలో సీసీటీవీల తొలగింపు లేదా OMR రీ-ప్రింటింగ్ సాధ్యం కాదనే భావన వ్యక్తమవుతోంది. గతంలో సీఐడీ విచారణలో కొందరు అధికారులు ఉన్నత స్థాయి ఒత్తిళ్ల వల్లే నిబంధనలు మార్చామని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం ఈ విచారణను రాజకీయ నాయకత్వం దిశగా పొడిగిస్తే నాటి సీఎంబో లేదా కీలక నేతలకు చిక్కులు తప్పవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
