Chandrababu Purchase Land In Amaravati: ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోబోతున్నారు. పదేళ్లుగా అద్దే ఇంట్లో ఉన్న ఆయన సొంత ఇంటి నిర్మాణం కోసం అమరావతిలో భూమి కొనుగోలు చేశారు. ఇప్పటికే కొలుగోలు ప్రక్రియ పూర్తి అయినట్టు తెలుస్తోంది. మంగళవారం ఆ ప్రాంతంలో అధికారులు భూ పరీక్షలు నిర్వహించారు.


ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు శాశ్వత నివాసం లేదంటూ ప్రత్యర్థులు చేసే విమర్శలకు చంద్రబాబు దీటుగా సమాధానం చెప్పబోతున్నారు. అమరావతిలోనే శాశ్వత నివాసం ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభించారు. వెలగపూడి రెవెన్యూ పరిధిలో 25 వేల చదరపు గజాల ప్లాట్‌ కొనుగోలు చేశారు. ఈ-6 రోడ్డుకు ఆనుకొని ఉన్న భూమిని ముగ్గురు రైతుల నుంచి డబ్బులు చెల్లించి కొనుగోలు చేశారు. 


ఇది దాదాపు అమరావతికి మధ్యలో ఉన్నట్టు చెబుతున్నారు. ఈ భూమికి సమీపంలో సీడ్‌ యాక్ససెస్‌ రోడ్డు, గెజిటెడ్‌ అధికారులు, ఎన్జీవోల నివాస సముదాయాలు, న్యాయమూర్తుల బంగ్లాలు, తాత్కాలిక హైకోర్టు, విట్, అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ ఉన్నాయి.  


ప్రస్తుతం మట్టి పరీక్షలు చేస్తున్న ఐదు ఎకరాల స్థలంలో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ఈ ఐదు ఎకరాల్లో కొంత వరకు ఇంటిని నిర్మించి మిగిలిన స్థలంలో మొక్కల పెంపకం, సిబ్బంది కోసం క్వార్టర్స్‌, పార్కింగ్‌ కోసం నిర్మాణాలు చేపట్టనున్నారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విజయవాడ మకాం మార్చిన చంద్రబాబు కృష్ణా నది ఒడ్డున ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న లింగమనేని సంబంధించిన గెస్ట్‌హౌస్‌ను అద్దెకు తీసుకున్నారు. పదేళ్లుగా అక్కడే ఉంటున్నారు. దీనిపై వైసీపీ చాలా సార్లు విమర్శలు చేసింది.