Inner Ring Road Case: ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ స్కామ్‌ కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత పొంగూరు నారాయణకు సీఐడీ నోటీసులు పంపింది. ఈ కేసులో ఆయన ఇదివరకే ముందస్తు బెయిల్‌ పిటిషన్‌  దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఇంకా పెండింగ్‌లో ఉంది. దీంతో ఆయన విచారణను ఎదుర్కోవాల్సి ఉంది. అక్టోబర్‌ 4వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. అమరావతి ఇన్నర్‌రింగ్‌ రోడ్డు స్కామ్‌లో నారాయణ ఏ2గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ మీద బయట ఉన్నారు. 


తాజాగా ఈ కేసులో సీఐడీ దూకుడు పెంచింది. దీంతో నారాయణ ముందస్తు బెయిల్‌ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. ఈలోపే ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కోర్టు ఆదేశాల ప్రకారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. సీఐడీ అధికారులు స్వయంగా ఢిల్లీ వెళ్లి అక్టోబర్‌ 4వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని  నారా లోకేష్‌కు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు అదే తేదీన నారాయణను సైతం విచారణకు హాజరుకావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు స్కామ్‌ కేసులో ఇద్దరిని కలిపి విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.


చంద్రబాబు హయాంలో అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో అక్రమాలు జరిగాయంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ పేరిట భారీ అవినీతి జరిగిందని దర్యాప్తు చేయాలని ఆళ్ల కోరారు. ఈ మేరకు సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో ఏ-1గా చంద్రబాబు నాయుడు పేరును, ఏ-2గా మాజీ మంత్రి నారాయణ పేరును సీఐడీ ఈ కేసులో చేర్చింది.


లోకేష్‌కు నోటీసులు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ సీఐడీ అధికారులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు నోటీసులు ఇచ్చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సీఐడీ అధికారులు 41ఏ నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో నారా లోకేశ్ కు వాట్సాప్ లోనూ నోటీసులు పంపినట్లుగా తెలుస్తోంది. తాను నోటీసులు అందుకున్నానని.. నారా లోకేశ్ వాట్సాప్ లో రిప్లై ఇచ్చినట్లుగా తెలుస్తుంది. 4వ తేదీన ఉదయం గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి హాజరు కావాలని  నోటీసుల్లో పేర్కొన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో  ఇటీవల ఏ 14గా లోకేష్ పేరు చేర్చారు. అయితే తర్వాత ఎఫ్ఐఆర్ మార్చామని హైకోర్టుకు చెప్పారు.. ఎలా మార్చారు.. సాక్షిగా మార్చారా లేకపోతే.. నిందితుడిగానే ఉంచారా అన్నదానిపై స్పష్టత లేదు.


ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ ను అరెస్టు చేయబోమని ఆయనపై ఎఫ్ఐఆర్‌ను దర్యాప్తు అధికారి మార్చారని ఏజీ హైకోర్టుకు చెప్పారు. దీంతో అరెస్టు చేసే ప్రశ్నే ఉండదు కాబట్టి.. బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. అలాగే స్కిల్ కేసు, ఫైబర్ నెట్ కేసుల్లోనూ  నారా లోకేష్‌ను నిందితుడుగా చేర్చారు. దీంతో ఆ కేసుల్లోనూ ముందస్తు  బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ నాలుగో తేదీ వరకూ అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు అనంతరం నారా లోకేశ్ న్యాయవాదులతో చర్చించేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలోని అశోకా రోడ్డు 50లోని ఎంపీ గల్లా జయదేవ్ ఇంటికి నారా లోకేశ్ ఉన్నారు.