AP CM Chandrababu Naidu Singapore tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేటి నుంచి సింగపూర్‌లో పర్యటించనున్నారు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్‌ను ప్రమోట్ చేసి పెట్టుబడులు ఆకర్షించాలనే నాలుగు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. జులై 26న బయల్దేరి వెళ్లనున్న చంద్రబాబు మళ్లీ జులై 31న రాష్ట్రానికి తిరిగి వస్తాయి. ఈ సమయంలో వివిధ పారిశ్రామికవేత్తలు, కంపెనీల అధినేతలతో సమావేశమవుతారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తారు.
వైసీపీ అధికారంలో ఐదేళ్లు చాలా కంపెనీలను బెదరగొట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి పంపేసిందని అందుకే ఇప్పుడు మళ్లీ బ్రాండ్ ఏపీని పునఃనిర్మించాలని చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. ఇప్పటికీ కూడా చాలా మందిలో ఆ భయం పోలేదని అందుకే ఇక్కడ ఉండే సౌకర్యాల గురించి వాళ్లకు తెలిసినా పాలసీల రూపకల్పన, ఇతర అంశాలపై భరోసా ఇవ్వాల్సి వస్తోందని అంటున్నారు.
ఆరు రోజుల సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రితోపాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్, అయా శాఖల అధికారులు ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా దావోస్ వెళ్లింది ముఖ్యమంత్రి బృందం. ఇప్పుడు సింగపూర్ వెళ్తోంది. అధికారంలోకి వచ్చిన పారిశ్రామిక అభివృద్ధి కోసం చేపట్టిన తీసుకున్న పాలసీలు, చేపట్టిన ప్రాజెక్టులు, పెట్టబడులు పెడుతున్న బడా కంపెనీలు, ఆంధ్రప్రదేశ్ శరవేగంగా రూపుదిద్దుకుంటున్న ఎయిర్‌పోర్టులు, సీపోర్టులు, రోడ్డు రవాణా వ్యవస్థ ఇలా అందుబాటులో ఉన్న ప్రతి సౌకర్యం గురించి వ్యాపారవేత్తలకు వివరించనున్నారు. బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేయనున్న సీఎం బృందం... పోర్టు ఆధారిత ప్రాజె క్టులు, సెమీకండక్టర్లు, ఏఐ, డేటాసెంటర్లు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉన్న ప్రాజెక్టుల గురించి వివరించనున్నారు. మరో రెండు నెలల్లో విశాఖ పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ బిజినెస్‌మెన్, కంపెనీలను ఆహ్వానించబోతున్నారు. దీని కోసం అక్కడ జరిగే డిజిటల్ ఎకానమి, ఫిన్‌టెక్స్‌పై నిర్వహించే రౌండ్‌టేబుల్ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు పాల్గొంటారు. బిజినెస్ రోడ్ షోకు హాజరవుతారు.
సింగపూర్‌లో కొత్తగా వచ్చిన వివిధ బిజినెస్ మోడళ్లను పరిశీలిస్తారు. మొదటి రోజు ప్రవాసాంధ్రులతో భేటీ అవుతారు. సింగపూర్‌తోపాటు చుట్టుపక్కల దేశాల్లో సెటిల్ అయిన ఆంధ్రప్రదేశ్‌సంతతితో మాట్లాడుతారు. ఏపీలో పేదరిక నిర్మూలనకు చేపట్టిన P4 కార్యక్రమాన్ని వారికి వివరించనున్నారు. పేద కుటుంబాలను దత్తత తీసుకొని వారికి చేయూత ఇవ్వాలని పిలుపునివ్వనున్నారు. తాను చెప్పడమే కాకుండా కుప్పంలో కొన్ని కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు చెప్పనున్నారు. వీలైతే దత్తత లేదంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ఏదో రూపంలో మాతృభూమి రుణం తీర్చుకోవాలని వారిని ఒప్పించనున్నారు.