మార్చి 24 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు- 16న బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న బుగ్గన 
 
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మార్చి 24వ తేదీ వరకు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తొమ్మిది రోజులపాటు జరిగే సమావేశాల్లో ఈ నెల 16న బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు. 


అసెంబ్లీ సమావేశాలు 9 రోజులు షెడ్యూల్ ఇదే. 
మార్చి15 (బుధవారం)-  గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం- చర్చ 
మార్చి16(గురువారం)-  2023-24 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశ పెట్టనున్నారు. 
మార్చి19(ఆది వారం) -  సెలవు
మార్చి22(బుధవారం)-  ఉగాది పండుగ సందర్భంగా సెలవు
మార్చి23(గురు వారం) - ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు 


ఈ ఉదయం గవర్నర్ స్పీచ్‌లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఐదు కోట్ల మంది ఆకాంక్షలతో ఏర్పడిన ప్రభుత్వం ఆ దిశగానే నాలుగేళ్లుగా అనేక అద్భుతాలు సాధించిందన్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభమైన సందర్భంగా ఆయన ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తన స్పీచ్‌లో నాలుగేళ్లుగా ప్రభుత్వం సాదించిన ఫలితాలను సభకు వివరించారు.


పోలవరం సహా నీటి ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేస్తున్నామని గవర్నర్‌తో చెప్పించడంపై తెలుగుదేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ సభ్యులంతా సభను బాయ్‌కాట్‌ చేసి బయటకు వచ్చి ఆందోళన చేపట్టారు. వైసీపీ అవలంభిస్తున్న విధానాలపై మండిపడ్డారు. వీటిని ఎదుర్కొనేందుకు పోరాడేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. వైసీపీ అబద్దాలు ప్రచారం చేయడమే కాకుండా గవర్నర్‌తో  కూడా అబద్దాలు చెప్పించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.